IPL 2026: ఐపీఎల్ 2026కి వెస్టిండీస్, సౌతాఫ్రికా ఆటగాళ్ల రాకపై సస్పెన్స్!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2026 (IPL 2026) ఆరంభానికి ముందే ఫ్రాంచైజీలకు ఊహించని షాక్ తగిలేలా ఉంది. బీసీసీఐ బుధవారం తొలి 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. మార్చి 28న ఈ మెగా టోర్నీ ఘనంగా ప్రారంభం కానుంది. టోర్నీ ప్రారంభానికి కేవలం 15 రోజులే సమయం ఉండటంతో, ఫ్రాంచైజీలన్నీ సన్నాహకాల్లో నిమగ్నమయ్యాయి. అయితే సరిగ్గా ఈ సమయంలో పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ఐపీఎల్ నిర్వహణపై తీవ్ర ప్రభావాన్ని చూపేలా కనిపిస్తున్నాయి.
దెబ్బతిన్న ఫ్లైట్ సర్వీసులు..
ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న భీకర యుద్ధ వాతావరణం కారణంగా పశ్చిమాసియా గగనతలంలో తీవ్రమైన ప్రయాణ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా అంతర్జాతీయ విమానయానానికి కీలకమైన దుబాయ్, దోహా విమానాశ్రయాల గుండా వెళ్లే ఎయిర్ ట్రాఫిక్‌పై అనేక పరిమితులు విధించారు. ఈ పరిణామాలతో ఐపీఎల్ (IPL 2026) ఫ్రాంచైజీలకు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లకు చెందిన విదేశీ స్టార్లు సకాలంలో భారత్‌కు చేరుకుంటారా? లేదా? అన్నది తీవ్ర అనుమానంగా మారింది.
టీ20 వరల్డ్ కప్‌లో కష్టాలు..
నిజానికి, ఇటీవలే భారత్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాల్గొన్న దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఆటగాళ్లు ఈ ఉద్రిక్తతల కారణంగా ఇక్కడే చిక్కుకుపోయారు. తమ స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు వారం రోజుల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐసీసీ ఎట్టకేలకు బుధ, గురువారాల్లో వారికి ప్రయాణ ఏర్పాట్లు చేసింది. విమానాల రద్దు, తీవ్ర ఆలస్యాలతో విసుగెత్తిన ఈ రెండు దేశాల ప్లేయర్లు.. ఇప్పుడు మళ్లీ కేవలం రెండు వారాల స్వల్ప వ్యవధిలో ఐపీఎల్ (IPL 2026) కోసం భారత్‌కు రావడం అనేది శారీరకంగా, మానసికంగా కత్తిమీద సాము లాంటిదే. దీనికి తోడు యుద్ధం వల్ల విమాన టికెట్ల ధరలు కూడా ఆకాశాన్నంటాయి.
ఇవి కూడా చదవండి
ఈ 20 మంది స్టార్లదే సమస్య:
ఈసారి ఐపీఎల్లో (IPL 2026) వెస్టిండీస్, దక్షిణాఫ్రికా దేశాల నుంచి ఏకంగా 20 మంది ఆటగాళ్లు వివిధ ఫ్రాంచైజీలకు ఎంపికయ్యారు. వీరిలో అత్యధికులు జట్లలో కీలక పాత్ర పోషించే మ్యాచ్ విన్నర్లు కావడం గమనార్హం.
వెస్టిండీస్ స్టార్లు: నికోలస్ పూరన్ (లక్నో), సునీల్ నరైన్ (కేకేఆర్), రోవ్‌మన్ పావెల్ (కేకేఆర్), అకీల్ హుస్సేన్ (సీఎస్కే), షిమ్రాన్ హెట్‌మైర్ (రాజస్థాన్), రొమారియో షెఫర్డ్ (ఆర్సీబీ), రూథర్‌ఫోర్డ్ (ముంబై), జాసన్ హోల్డర్ (గుజరాత్).
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
దక్షిణాఫ్రికా స్టార్లు: కగిసో రబాడ (గుజరాత్), ఎయిడెన్ మార్క్రమ్ (లక్నో), మార్కో జాన్సెన్ (పంజాబ్), డికాక్ (ముంబై), డెవాల్డ్ బ్రెవిస్ (సీఎస్కే), ట్రిస్టన్ స్టబ్స్, లుంగి ఎంగిడి (ఢిల్లీ). రాజస్థాన్ జట్టులో నాండ్రే బర్గర్, క్వెనా మఫాకాలు ఉన్నారు.
వీరందరినీ (IPL 2026) ఫ్రాంచైజీలు భారీ ధరకు కొనుగోలు చేయడం లేదా రిటైన్ చేసుకోవడం జరిగింది. వీరు గనక తొలి దశ మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోతే, ఆయా జట్ల విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడటం ఖాయం. అయితే, ఈ ఆందోళనల నడుమ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సీఈవో కాశీ విశ్వనాథన్ మాత్రం సానుకూలంగా స్పందించారు. తమ విదేశీ ప్లేయర్లు బ్రెవిస్, హుస్సేన్ తొలి మ్యాచ్‌కు ముందే ఖచ్చితంగా జట్టుతో కలుస్తారని ఆయన దీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి








