కేటీఆర్, కవిత బీజేపీలోకి.. ఎవరొచ్చినా ఆహ్వానిస్తాం : కేంద్ర మంత్రి ప్రహ్లాద్
బీజేపీలోకి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఎవరు వచ్చినా సాధరంగా ఆహ్వానిస్తామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేకనే బీజేపీ నేతల ఇళ్లపై కేసీఆర్ ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి ఘటనపై కేంద్ర మంత్రి తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించడం హాస్యాస్పందంగా ఉందన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తే సీఎం కేసీఆర్ ఎందుకు ముఖం చాటేస్తున్నారు. తను చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికే కేసీఆర్ అలా చేస్తున్నారా? మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. సీఎం కేసీఆర్ అబద్ధాలకు అడ్డులేకుండా పోతోంది. గనులపై ఒడిశా రాష్ట్రం నుంచి లాభాన్ని గడిస్తుంటే, తెలంగాణ గనుల నుంచి వచ్చే రాబడిని సద్వినియోగం చేసుకోవడం లేదు. పీఎం అవాస్ యోజన పథకాన్ని సైతం తెలంగాణ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోతోంది అని అన్నారు.













