Telangana Municipal Elections 2026: మున్సిపల్ ‘పోరు’లో అగ్రనేతల దూకుడు..
Telangana Municipal Elections 2026: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో, అన్ని ప్రధాన పార్టీలు అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా భారీ వ్యూహరచన చేస్తున్నాయి. మున్సి‘పోల్స్’ ప్రచార పర్వం ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. అగ్రనేతల రాకతో మున్సిపాలిటీల్లో సందడి నెలకొంది.
కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచార పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నారు. ఈ ఎన్నికలను ప్రభుత్వంపై ప్రజాభిప్రాయ సేకరణగా భావిస్తున్న కాంగ్రెస్, రేపు మిర్యాలగూడలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ద్వారా ప్రచారానికి అంకురార్పణ చేయనుంది. ఫిబ్రవరి 3 నుండి ఫిబ్రవరి 9వ తేదీ వరకు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఖరారైంది. ప్రతిరోజూ ఏదో ఒక జిల్లా కేంద్రంలో లేదా ప్రధాన మున్సిపాలిటీలో సభ నిర్వహిస్తూ, తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించారు.
బీఆర్ఎస్ ప్రతీకార వ్యూహం: శాసనసభ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఈ కీలక ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కీలక నేత హరీశ్ రావు మున్సిపాలిటీల్లో వరుస ర్యాలీలు, రోడ్ షోలు , సభలు నిర్వహిస్తూ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా గులాబీ దళం దూసుకుపోతోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంత ఓటర్లపై కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు.
బీజేపీ ఆపరేషన్ నార్త్ తెలంగాణ: మరోవైపు బీజేపీ తమకు బలమున్న ఉత్తర తెలంగాణ జిల్లాలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక వార్డులు గెలవడమే లక్ష్యంగా పార్టీ జాతీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రచార బరిలోకి దించుతోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి అందిస్తున్న నిధుల గురించి ప్రజలకు వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
మొత్తానికి, రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీల హేమాహేమీలు రంగంలోకి దిగడంతో మున్సిపల్ పోరు రసవత్తరంగా మారింది. గెలుపు మాదంటే మాదని ప్రతి పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.






