Drugs Party: రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ..!? పట్టుబడ్డ టీడీపీ ఎంపీ!!
హైదరాబాద్ శివారు ప్రాంతమైన మొయినాబాద్‌లోని అజీజ్ నగర్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఒకప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్, ఇప్పుడు డ్రగ్స్, అక్రమ ఆయుధాల వినియోగం వంటి తీవ్ర ఆరోపణలతో గుప్పుమంది. శనివారం రాత్రి జరిగిన పోలీసుల మెరుపు దాడిలో వెలుగుచూసిన అంశాలు తెలంగాణ రాజకీయాల్లో పెను తుపానును రేపుతున్నాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం సైబరాబాద్ ఈగల్ టీమ్, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) పోలీసులు శనివారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌పై దాడులు నిర్వహించారు. పోలీసులు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా, అక్కడ ఉన్న కొందరు యువకులు వారిని అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినప్పటికీ, పక్కా ప్లాన్‌తో వెళ్లిన బలగాలు లోపలికి ప్రవేశించి తనిఖీలు చేపట్టాయి. ఈ సోదాల్లో పోలీసులకు దిగ్భ్రాంతికరమైన విషయాలు లభ్యమయ్యాయి. సుమారు 2 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ గాలిలోకి ఒక రౌండ్ కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ తుపాకీ రోహిత్ రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డి పేరు మీద ఉన్న లైసెన్స్డ్ ఆయుధం అని తేలింది. ఖరీదైన విదేశీ మద్యం సీసాలు, హుక్కా పాట్లు, TS09FE3929, TS09FE3939 నంబర్లు గల లగ్జరీ కార్లను పోలీసులు సీజ్ చేశారు.
ఈ పార్టీలో మొత్తం 10 మంది పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. వీళ్లలో 9 మంది పురుషులు కాగా, ఒక మహిళ ఉన్నారు. ప్రాథమిక డ్రగ్ పరీక్షల అనంతరం ఐదుగురికి పాజిటివ్ వచ్చినట్లు చేవేళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ అధికారికంగా ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితీష్ రెడ్డి, నమిత్ మిశ్రా, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డికి పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. ఈ పార్టీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆయనకు నెగెటివ్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన కేవలం ఒక క్రైమ్ కేసుగా మాత్రమే మిగిలిపోలేదు. దీనికి అనేక రాజకీయ కోణాలు ఉన్నాయి. చట్టసభల్లో ప్రజల గొంతుకగా ఉండాల్సిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం పదవిలో ఉన్న ఎంపీ వంటి వారు ఇలాంటి వివాదాస్పద పార్టీల్లో కనిపించడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఈ ఘటన ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. లైసెన్స్డ్ ఆయుధాన్ని మరొక వ్యక్తి ఉపయోగించి గాలిలోకి కాల్పులు జరపడం అనేది ఆయుధ చట్టం ప్రకారం తీవ్రమైన నేరం. ఇది అక్కడ జరిగిన పార్టీ ఎంత గందరగోళంగా ఉందో సూచిస్తోంది. ఈ ఉదంతం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. గతంలో రోహిత్ రెడ్డి చేసిన ఆరోపణలను గుర్తు చేస్తూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రస్తుతం నిందితుల రక్త నమూనాలను తదుపరి నిర్ధారణ కోసం ల్యాబ్‌కు పంపారు. డ్రగ్స్ వినియోగం, ఆయుధాల దుర్వినియోగం విధుల్లో ఉన్న పోలీసులపై ప్రతిఘటన వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో తదుపరి విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఇలాంటి అక్రమ కార్యకలాపాల్లో పట్టుబడటం సమాజానికి ఎలాంటి సంకేతాలు ఇస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.








