BRS: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా పైలెట్ రోహిత్ రెడ్డి, పార్టీకి కొత్త చిక్కులు..!
తాండూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పైలెట్ రోహిత్ రెడ్డి మరోసారి సంచలనంగా మారారు. తాజాగా మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్(Farm House)లో జరిగిన డ్రగ్స్ పార్టీ(Drugs Case) ఉదంతంతో రాజకీయ వర్గాల్లో, మీడియాలో సంచలనంగా మారారు. ఈ వ్యవహారం ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మరింత తలనొప్పిగా మారిందనే మాట రాజకీయ వర్గాల్లో వినపడుతోంది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచిన పైలెట్ రోహిత్ రెడ్డికి, ఈ వరుస వివాదాలు.. ఆయన రాజకీయ భవిష్యత్తునే కాకుండా, పార్టీ ప్రతిష్ఠను కూడా దెబ్బతీస్తున్నాయి.
నేడు తెల్లవారుజామున మొయినాబాద్‌లోని రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌పై ‘ఈగిల్'(Eagle) టీమ్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న పలువురు వీఐపీలతో పాటు రోహిత్ రెడ్డికి కూడా డ్రగ్ టెస్ట్ నిర్వహించగా, ఆయనకు కొకైన్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఏపీకి చెందిన ఓ ఎంపీ కూడా ఈ కేసులో పట్టుబడటం సంచలనంగా మారింది. గత నెలలోనే తాండూరు మున్సిపల్ ఎన్నికల లెక్కింపు కేంద్రంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించినందుకు రోహిత్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న తరుణంలో, కీలక నేతగా చెప్పే పైలెట్ రోహిత్ రెడ్డి.. ఇలాంటి కేసుల్లో చిక్కుకోవడం పార్టీ నాయకత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. గతంలో ఈడీ (ED) విచారణను ఎదుర్కోవడం, ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో పార్టీ క్యాడర్లో అసహనం పెరుగుతోంది. నియోజకవర్గ సమస్యల మీద కాకుండా, వ్యక్తిగత వివాదాలు, గన్ మెన్లతో రీల్స్ చేయడం వంటివి వ్యవహారాలతో ఆయనపై స్థానికంగా విమర్శలు వస్తున్నాయి.
గతంలో రోహిత్ రెడ్డి పార్టీ మారుతారని ప్రచారం జరిగినప్పుడు ఆయన వాటిని ఖండించారు. కానీ, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఆయన చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది. ఫోన్లను ధ్వంసం చేయడం, పోలీసులపై కాల్పులు జరపడం వంటి అంశాలను పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. మొత్తానికి, ఒకప్పుడు పార్టీకి అండగా ఉంటారని భావించిన రోహిత్ రెడ్డి, ఇప్పుడు తన వివాదాలతో బీఆర్ఎస్కు భారంగా మారారనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా సాగుతోంది.








