జీవన్‌దాన్ పథకంలో సర్కారు వెనుకంజ.. కార్పొరేట్ సంస్థలకు కాసుల వర్షం
Organ Donation: రాష్ట్రంలో అవయవ మార్పిడి ద్వారా ప్రాణదానం చేసే ‘జీవన్‌దాన్’ (సొట్టా తెలంగాణ) పథకం అమలులో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. దశాబ్దం క్రితం పేద రోగులకు లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ పథకం, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల వెనుకబాటుతనం వల్ల ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకే ఎక్కువ ప్రయోజనకరంగా మారుతోంది.
ఒకటికి 28 చొప్పున నమోదు..
రాష్ట్రంలో జీవన్‌దాన్ కింద నమోదైన మొత్తం 30 ఆసుపత్రులలో 26 ప్రైవేటు రంగానికి చెందినవి కాగా, ప్రభుత్వ పరిధిలో కేవలం నిమ్స్, గాంధీ, ఉస్మానియా, ఈఎస్ఐసీ అనే నాలుగు ఆసుపత్రులు మాత్రమే సేవలందిస్తున్నాయి. గణాంకాల ప్రకారం.. 2013 నుండి రాష్ట్రంలో రికార్డు అయిన 1,829 అవయవ దానాలలో 1,760 (96.5 శాతం) ప్రైవేటు ఆసుపత్రులలోనే జరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల వాటా కేవలం 69 అవయవ దానాలకే పరిమితమైంది. అంటే ఆసుపత్రులలో ఒక అవయవ దానం నమోదైతే, ప్రైవేటులో 28 నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. అవయవ మార్పిడి శస్త్రచికిత్సల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. ఇప్పటివరకు ప్రైవేటులో 4,475 సర్జరీలు జరగ్గా, ప్రభుత్వంలో కేవలం 775 మాత్రమే జరిగాయి.
ఇవి కూడా చదవండి
ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి..
జీవన్‌దాన్ కింద ప్రధానంగా కిడ్నీ, కాలేయం (లివర్), గుండె మార్పిడి శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సేవలు అంతంతమాత్రంగానే అందుతుండటంతో, నిరుపేద రోగులు సైతం తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రైవేటులో ఒక్క కిడ్నీ మార్పిడికే సుమారు 15 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుండటంతో, రోగుల కుటుంబాలు అప్పులపాలు కావాల్సి వస్తోంది.
ఒప్పించే ప్రత్యేక బృందాలు..
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ దానాలు క్షీణించడానికి ప్రధానంగా ‘ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్ల’ కొరత కారణమని తెలుస్తోంది. సాధారణంగా రోడ్డు ప్రమాద బాధితులు అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చినప్పుడు, అక్కడ బెడ్స్ దొరక్క ప్రైవేటుకు వెళ్తుంటారు. ఒకవేళ రోగి పరిస్థితి విషమించి బ్రెయిన్ డెడ్ అయితే, వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి అవయవ దానానికి ఒప్పించే ప్రత్యేక బృందాలు ప్రైవేటులో 24 గంటలూ అందుబాటులో ఉంటున్నాయి. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ కౌన్సిలింగ్ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదు.
ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు అవసరం..
ఢిల్లీ ఎయిమ్స్, చండీగఢ్ పీజీఐఎంఈఆర్ తరహాలో ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ప్రత్యేక అవయవ మార్పిడి విభాగాలను ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో ప్రతిపాదించిన ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’, సనత్‌నగర్ టీమ్స్‌లో కొత్త సదుపాయాలను త్వరితగతిన అందుబాటులోకి తెస్తేనే, జీవన్‌దాన్ సత్ఫలితాలు నిజమైన పేద ప్రజలకు అందుతాయని అధికారులు భావిస్తున్నారు.








