తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఫైర్.. క్షమాపణ చెప్పాలని డిమాండ్!
Ponnam Prabhakar: తెలంగాణ విభజనపై భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బ్రిటీష్ కాలంలో జరిగిన భారత్-పాక్ విభజన కంటే దారుణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను విడదీశారని ఆయన చేసిన ప్రసంగం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు.
విషం చిమ్మడం ..
బిజెపి నేతలకు సమయం దొరికినప్పుడల్లా తెలంగాణ రాష్ట్రంపై విషం చిమ్మడం అలవాటుగా మారిందని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. విభజనను పాక్ విభజనతో పోల్చడం ద్వారా రాష్ట్ర ఉనికిని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో బిజెపి రాష్ట్ర నాయకత్వం , ఎంపీలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. వెంటనే తేజస్వీ సూర్య , బిజెపి పార్టీ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వివాదాస్పద వ్యాఖ్యలు..
తెలంగాణ పట్ల బిజెపికి మొదటి నుండి వివక్ష ఉందని, అది మరోసారి స్పష్టమైందని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం మానేసి, ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయం చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఈ విషయంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.








