బీజేపీకి మల్లారెడ్డి బంపరాఫర్!?
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు మల్కాజిగిరి చుట్టూనే తిరుగుతున్నాయి. మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చేసినట్లే కనిపిస్తోంది. తన విద్యాసంస్థల సామ్రాజ్యాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఆయన ఇప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారనే వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేవలం మల్లారెడ్డి ఒక్కరే కాదు, ఆయన కుటుంబం మొత్తం కాషాయ కండువా కప్పుకోబోతోందని, దీని వెనుక భారీ పొలిటికల్ డీల్ కుదిరిందని ప్రచారం జరుగుతోంది.
ఇటీవల మల్లారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోడీని కలవడం రాజకీయంగా పెద్ద దుమారమే లేపింది. కేవలం మర్యాదపూర్వక భేటీ అని పైకి చెప్తున్నా, అది పార్టీ మార్పునకు పునాది అని విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి తోడు, మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి ఇటీవల హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య నేత తివారీని కలవడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూర్చింది. కాలేజీ ఫంక్షన్ కి ఆహ్వానించడానికే వెళ్లానని ఆమె కవర్ చేస్తున్నా, లోపల మాత్రం మల్కాజిగిరి ఎంపీ సీటుపై హామీ కోసమే ఈ భేటీలు జరుగుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి మల్లారెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. తన విద్యాసంస్థల భవనాలు, ఆక్రమణల ఆరోపణలు, చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలు వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. ఈ ఒత్తిడి నుంచి తట్టుకోవడానికి మల్లారెడ్డి తొలుత కాంగ్రెస్ వైపు చూశారు. కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. రేవంత్ రెడ్డి నో చెప్పడంతో, ఇక తనను కాపాడగల ఏకైక శక్తి బీజేపీ మాత్రమేనని మల్లారెడ్డి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరితే కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, ఐటీ దాడుల ముప్పు నుంచి తప్పుకోవచ్చని, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెంచవచ్చనేది ఆయన ఎత్తుగడ. అంతేకాక మల్లారెడ్డి విద్యాసంస్థలను దేశవ్యాప్తంగా విస్తరించాలనే ఆయన ఆకాంక్షలకు బీజేపీ మద్దతు కూడగట్టుకోవచ్చు.
బీజేపీ హైకమాండ్‌కు మల్లారెడ్డి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంటు సీటుతో పాటు, తన కుటుంబ సభ్యుల్లో మరో ఇద్దరు లేదా ముగ్గురికి అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఇందుకు ప్రతిఫలంగా, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీలకయ్యే ఖర్చు మొత్తాన్ని తానే భరిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే పార్టీకి ఎటువంటి ఆర్థిక భారం లేకుండా తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవాలని ఆయన చూస్తున్నారు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన కోణం కూడా ఉంది. బీజేపీలోని ఒక వర్గం మల్లారెడ్డిని ఆహ్వానించడం ద్వారా ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టాలని భావిస్తోంది. బీజేపీలోకి వచ్చినప్పటి నుంచి ఈటలకు పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదని, ఆయన కూడా పార్టీలో ఇమడలేకపోతున్నారనే ప్రచారం ఉంది. వచ్చే ఎన్నికల నాటికి ఈటల బీజేపీలో ఉంటారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ ఈటల పార్టీని వీడితే, మల్కాజిగిరి వంటి కీలక ప్రాంతంలో బలమైన ఆర్థిక, అంగ బలం ఉన్న మల్లారెడ్డి వంటి నేత ఉంటే పార్టీకి ప్లస్ అవుతుందని బీజేపీ పెద్దలు లెక్కలు వేస్తున్నారు.
మల్లారెడ్డి ఎంట్రీతో GHMC పరిధిలో బీజేపీ బలం మరింత పుంజుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో మల్లారెడ్డికి సొంతంగా ఓటు బ్యాంకు, క్యాడర్ ఉండడం బీజేపీకి కలిసొచ్చే అంశం. అయితే, ఒకప్పుడు రేవంత్ రెడ్డిని, బీజేపీని తిట్టిపోసిన మల్లారెడ్డి, ఇప్పుడు అవే పార్టీల పంచన చేరడంపై ప్రజల స్పందన ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. ఏదేమైనా, వచ్చే ఎన్నికల నాటికి మల్కాజిగిరిలో రాజకీయ యుద్ధం కొత్త మలుపులు తిరగడం ఖాయం. మల్లారెడ్డి కమలం గూటికి చేరితే, అది బీఆర్ఎస్కు మేడ్చల్ జిల్లాలో కోలుకోలేని దెబ్బే అవుతుంది.
ఇవి కూడా చదవండి








