చెరువుల అభివృద్ధి ‘హైడ్రా’దే.. మరి నిర్వహణ భారం ఎవరిది?
Hyderabad :నగరంలోని చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధి బాధ్యతలను భుజాన వేసుకున్న ‘హైడ్రా’ (HYDRAA)కు ఇప్పుడు వాటి నిర్వహణ ఒక సవాలుగా మారింది. ఆక్రమణలను తొలగించి, చెరువులను సుందరీకరించిన తర్వాత వాటిని ఎవరు పర్యవేక్షించాలనే విషయంలో మున్సిపల్ అధికారులు, హైడ్రా మధ్య సందిగ్ధత నెలకొంది. అభివృద్ధి చేసిన తటాకాలను హైడ్రాకే వదిలేస్తూ జీహెచ్ఎంసీ చేతులు దులుపుకుంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పరిస్థితి భిన్నంగా..
చెరువుల చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల బిల్లులు, రోజుకు మూడు షిఫ్టుల్లో పనిచేసే భద్రతా సిబ్బంది జీతభత్యాలు, ఇతర నిర్వహణ ఖర్చులు ఇప్పుడు ప్రధాన సమస్యగా మారాయి. నిబంధనల ప్రకారం చెరువు కట్టలు, బఫర్ జోన్ల బాధ్యతను మున్సిపల్ అధికారులు, నీటిపారుదల శాఖ ఇంజనీర్లు చూడాలి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. నిధుల కేటాయింపు నేరుగా లేకపోవడం, హెచ్ఎండీఏ నిధులపైనే ఆధారపడాల్సి రావడంతో హైడ్రా వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది.
చెరువులను ట్యాంకుల్లా మార్చడం..
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు సుమారు 20 చెరువుల్లో ఆక్రమణలను తొలగించారు. అంబర్‌పేటలోని బతుకమ్మకుంట, పాతబస్తీలోని బమ్రుల్ ఉద్దౌలా, కూకట్పల్లి నల్లచెరువు వంటి వాటిని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించారు. అయితే, ఈ చెరువులను లోతుగా తవ్వి ట్యాంకుల్లా మార్చడం వల్ల వర్షాకాలంలో వరదను ఇవి ఎంతవరకు తట్టుకోగలవనే సందేహాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
నిర్వహణ బాధ్యతలపై ప్రజలు ఆందోళన ..
నగరానికి ఆభరణాలుగా మారిన ఈ చెరువుల నిర్వహణ బాధ్యతను స్పష్టంగా ఎవరికి అప్పగించాలనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. అప్పటివరకు ఈ తటాకాల సంరక్షణపై నీలినీడలు కమ్ముకునే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.








