Telangana : సిద్దిపేటకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు రేవంత్: హరీశ్ రావు
Harish Rao: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో, మాజీ మంత్రి , బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఆయనకు ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ పర్యటనను ఉద్దేశించి హరీశ్ రావు ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
క్రెడిట్ పాలిటిక్స్: నర్మెట్టలో ప్రారంభించబోయే రూ. 300 కోట్ల ఆయిల్ పామ్ ఫ్యాక్టరీతో పాటు జిల్లా జైలు, ఆయుష్ ఆస్పత్రి, సెంట్రల్ డ్రగ్ స్టోర్ వంటివన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని హరీశ్ రావు పేర్కొన్నారు. “శ్రమ మాది.. శిలాఫలకాలు మీవా?” అంటూ ఆయన ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి
కాళేశ్వరం ప్రాజెక్టు: ఆయిల్ పామ్ సాగుకు ప్రాణాధారమైన కాళేశ్వరం ప్రాజెక్టును గతంలో విమర్శించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు అదే ప్రాజెక్టు నీటితో నడిచే ఫ్యాక్టరీని ఏ మొఖం పెట్టుకుని ప్రారంభిస్తారని నిలదీశారు.
రైతు సమస్యలు: జిల్లాలో సుమారు 22 వేల మంది రైతులకు రూ. 300 కోట్ల రుణమాఫీ ఇంకా పెండింగ్‌లో ఉందని, కేవలం 48 శాతం మందికి మాత్రమే లబ్ధి చేకూరిందని ఆయన ఆరోపించారు. రైతుబంధు నిధుల నిలిపివేతపై కూడా వివరణ డిమాండ్ చేశారు.
నిధుల రద్దు: సిద్దిపేట నియోజకవర్గానికి గతంలో మంజూరైన రూ. 1071 కోట్ల నిధులను రేవంత్ సర్కార్ రద్దు చేసిందని హరీశ్ రావు మండిపడ్డారు. వెటర్నరీ కాలేజీ, శిల్పారామం, స్పోర్ట్స్ స్టేడియం వంటి పనులను రద్దు చేసి, వాటిని కొడంగల్‌కు తరలించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకుంటూ, పాత పనులకు రిబ్బన్ కటింగ్ చేయడానికి రావడం పట్ల రేవంత్ రెడ్డి తన వైఖరిని మార్చుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి








