Eatala Rajender: బీఆర్ఎస్లోకి వెళ్లే ప్రసక్తే లేదు.. అసత్య ప్రచారాలపై ఈటల స్పష్టత
Eatala Rajender: తాను మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. ఇటువంటి వార్తలు సృష్టిస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు.
అవమానించి బయటకు పంపారు:
ఎటువంటి తప్పు చేయకపోయినా గతంలో బీఆర్ఎస్ తనను మెడలు పట్టి బయటకు గెంటేసిందని ఈటల గుర్తు చేశారు. రాత్రికి రాత్రే తనను బర్తరఫ్ చేసి, అధికార బలంతో వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో తనను ఎన్నో అవమానాలకు గురి చేసిన విషయాన్ని మర్చిపోలేదని పేర్కొన్నారు.
పోస్టర్ల రాజకీయాలపై ఆగ్రహం:
కరీంనగర్లో కొందరు తనపై కావాలనే పోస్టర్లు వేయిస్తున్నారని, తాను పార్టీ మారుతున్నట్లు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. రాజకీయాల్లో పార్టీలు మారడం అంటే దుస్తులు మార్చినంత సులభం కాదని హితవు పలికారు. ప్రస్తుతం తాను ఉన్న పార్టీని వీడే ప్రసక్తే లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే పరిస్థితి రాదని స్పష్టం చేశారు.






