లింకులు నొక్కలేదు.. ఓటీపీ చెప్పలేదు.. అయినా బ్యాంక్ ఖాతా ఖాళీ
Cyber Crimes: రాజధాని నగరంలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. రకరకాల సాకులు చెపుతూ, నమ్మకమైన వ్యక్తుల్లా నటిస్తూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఐదు ప్రధాన సైబర్ మోసాల్లో బాధితులు లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు.
రూ.18 లక్షలు బదిలీ చేయాలంటూ మెసేజ్..
మాదాపూర్‌కు చెందిన సూర్య అనే వ్యక్తి ఒక ప్రైవేట్ సంస్థలో ఫైనాన్స్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూన్ 2వ తేదీన సదరు కంపెనీ ప్రతినిధి పేరుతో ఆయనకు ఒక సందేశం వచ్చింది. అత్యవసరంగా రూ.18 లక్షలు బదిలీ చేయాలంటూ ఆ మెసేజ్‌లో కోరడంతో, నిజమేనని నమ్మి సూర్య వెంటనే ఆ నగదును బదిలీ చేశారు. ఆ తర్వాత తానే మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైంది.
విడతలవారీగా రూ.15 లక్షలు..
చందానగర్‌కు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఆరు నెలల క్రితం ఫేస్బుక్లో ఒక మహిళ పరిచయమైంది. ఆన్లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని ఆమె అతడిని నమ్మించింది. దీంతో సదరు ఉద్యోగి పెట్టుబడుల పేరిట విడతలవారీగా రూ.15 లక్షలు సదరు మహిళకు పంపించారు. అయితే ఆ తర్వాత అవతలి వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో, తను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు శేరిలింగంపల్లి పరిధిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రూ.11.29 లక్షలను పెట్టుబడిగా..
మియాపూర్‌కు చెందిన సతీష్ అనే ప్రైవేటు ఉద్యోగి కూడా ఇలాగే ఆన్లైన్ ట్రేడింగ్ ఉచ్చులో చిక్కుకున్నారు. గత ఫిబ్రవరి నెలలో కల్యాణ్ అనే వ్యక్తి సతీష్‌కు ఫోన్ చేసి, ట్రేడింగ్ ద్వారా భారీ లాభాలు పొందవచ్చని ఆశ చూపారు. అది నమ్మిన సతీష్ మొత్తం రూ.11.29 లక్షలను పెట్టుబడిగా పెట్టారు. అయితే పెట్టిన డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇవ్వకపోవడంతో మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు.
ముడి సరుకు సరఫరా చేస్తామని ..
గచ్చిబౌలికి చెందిన ఒక వ్యక్తి సొంతంగా పరిశ్రమ నిర్వహిస్తున్నారు. తన పరిశ్రమకు కావలసిన ముడి సరుకు (రా మెటీరియల్) కోసం ఆయన హీరేన్ ఫోరియా అనే వ్యక్తిని సంప్రదించారు. ఆ వ్యాపారి ఇచ్చిన బ్యాంక్ ఖాతాకు బాధితుడు రూ.10.79 లక్షలను పంపించారు. అయితే డబ్బులు అందిన తర్వాత హీరేన్ ఫోరియా అందుబాటులోకి లేకుండా పోవడంతో రాయదుర్గం పరిధిలో కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
రూ.2.59 లక్షలు డెబిట్..
అమీన్‌పూర్‌కు చెందిన ఒక మహిళకు బీరంగూడలోని యూనియన్ బ్యాంక్‌లో ఖాతా ఉంది. అయితే ఈ నెల 2వ తేదీన ఆమె ప్రమేయం లేకుండానే ఆమె బ్యాంక్ ఖాతా నుండి నేరుగా రూ.2.59 లక్షలు డెబిట్ అయ్యాయి. సైబర్ నేరగాళ్లు తన ఖాతా నుండి ఈ సొమ్మును కొట్టేసినట్లు గుర్తించిన సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.








