HJ Dora: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జే దొర ఇకలేరు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డీజీపీగా పనిచేసిన 1965 బ్యాచ్ ఐపీఎస్ అధికారి హెచ్‌జే దొర (HJ Dora) (83) కన్నుమూశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలానికి చెందిన ఆయన కొద్దికాలంగా బీపీ, బ్రాంకియల్ ఆస్థమా, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. రెండేళ్లుగా హైదరాబాద్‌లోని నిమ్స్‌లో డయాలసిస్ చేయించుకుంటున్నారు. శుక్రవారం ఉదయం కూడా ఆయన నిమ్స్‌కు వచ్చి డయాలసిస్ చేయించుకొని ఇంటికి వెళ్లారు. కానీ, ఆ కొద్ది సేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో, కుటుంబసభ్యులు వెంటనే నిమ్స్‌కు తరలించారు. అన్ని రకాల చికిత్సలు అందించినా ఫలితం లేకపోయిందని, హెచ్‌జే దొర తుదిశ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు. విషయం తెలియగానే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి (Shivadhar Reddy), ఇంటిలిజెన్స్ చీఫ్ విజయకుమార్ (Vijaykumar), నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ నిమ్స్ ఆస్పత్రికి చేరుకొని నివాళులర్పించారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
హెచ్‌జే దొర ఆంధ్రా యూనివర్శిటీలో ఎంఏ ఎకనామిక్స్ చదివారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా 1996లో బాధ్యతలు స్వీకరించిన ఆయన ఐదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత సిఐఎస్ఎఫ్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లో బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా, ఏపీ సీఐడీ (CID) చీఫ్ గానూ పనిచేశారు. నక్సల్స్ పై ఉక్కుపాదం మోపడానికి దొర ఆధ్వర్యంలోనే అప్పట్లో గ్రేహౌండ్స్ విభాగం ఏర్పడింది. అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబుకు హెచ్‌జే దొర అత్యంత నమ్మకస్తులని పేరు. నక్సల్స్ ఉద్యమాన్ని అణచివేయడానికి అప్పట్లో దొర గ్రామస్ధాయిలో ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేశారు. నాటి పీపుల్స్ వార్ హిట్ లిస్టులో దొర మొదటి వరుసలో ఉండటంతో ఆయన రిటైర్ అయినా కూడా చివరి వరకు హై సెక్యూరిటీ జోన్లోనే ఉన్నారు. వివిధ హోదాల్లో పనిచేసిన దొర ఇండియన్ ఒలింపిక్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. దొర భౌతికకాయాన్ని బంజారాహిల్స్ రోడ్డు నంబరు 3లోని ఆయన నివాసానికి చేర్చారు. శనివారం అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి








