US-Iran War: ఇరాన్ యుద్ధ ఓటమికి స్కేప్ గోట్.. హెగ్సెత్…? ట్రంప్ ఎస్కేప్ అవుతున్నారా…?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గొప్ప బిజినెస్ మ్యాన్. ఎప్పుడు తనకు నష్టం కలిగించే పని చేయరు. ఎక్కడైనా వీసమెత్తు మంచి జరిగితే … ఆ క్రెడిట్ మాత్రం తనకు కావాలంటారు. ఇప్పుడు ఇరాన్ విషయంలో అమెరికా ఏమాత్రం ముందుకెళ్లలేకపోతోంది. ఎందుకంటే హర్మూజ్ ను ఇరాన్ గుప్పిటపట్టింది. కాదని ముందుకెళ్లి సముద్ర జలాల్లో దాడులకు దిగుదామంటే సీమైన్స్ అడ్డంకులుగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ పై.. తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది.
మరీ ముఖ్యంగా అమెరికన్లు.. ట్రంప్ వ్యవహార శైలిని తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారానికి ఓ స్కేప్ గోట్ ట్రంప్ కు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ఎవరో కాదు.. అమెరికా రక్షణమంత్రి పీటర్ హెగ్సెత్.. తాజాగా ఇరాన్‌పై దాడి చేయమని తొలుత రక్షణశాఖ కార్యదర్శి పీట్ హెగ్సెత్ పేర్కొన్నట్లు ట్రంప్ తెలిపారు.
టెన్నెసీలో జరిగిన ఓ రౌండ్‌టేబుల్ సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టేముందు కొందరు అధికారులతో తాను జరిపిన చర్చల గురించి వివరించారు. ‘నేను పీట్తో సహా అనేకమంది యూఎస్ అధికారులకు ఫోన్ చేశాను. పశ్చిమాసియాలో నెలకొన్న సమస్య గురించి వివరించా. కొన్నిరోజుల పాటు సైన్యంతో అక్కడ పోరాడి.. ఆ సమస్యను పరిష్కరించే విషయాన్ని ప్రస్తావించా’ అని ట్రంప్ వెల్లడించారు. టెహ్రాన్‌పై దాడికి తొలుత పీట్ హెగ్సెత్ (Pete Hegseth) మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. తన పక్కన కూర్చున్న హెగ్సెత్ను ప్రస్తావిస్తూ.. ‘‘పీట్.. ఈ విషయంపై మొదటగా మాట్లాడింది మీరే అనుకుంటున్నా. ‘ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండకూడదు. కాబట్టి.. మనం దాడి చేద్దాం’ అని మీరే అన్నారు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చకు దారితీశాయి. కాగా.. దీనిపై హెగ్సెత్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక, ఇరాన్‌తో యుద్ధంపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అంత ఆసక్తిగా లేరని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్‌పై తమ దాడులకు ప్రతీకారంగా.. గల్ఫ్ దేశాలన్నింటినీ ఆ దేశం లక్ష్యంగా చేసుకోవడం తమను ఆశ్చర్యపరిచిందన్నారు. దీని గురించి తాము ఆలోచించలేదన్నారు.
ఇవి కూడా చదవండి








