Iran: ట్రంప్ ప్రకటన పెద్ద అబద్ధం, అమెరికా వెనక్కి తగ్గిందంటూ ఇరాన్ ఎద్దేవా..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కు ఇరాన్ ఊహించని షాక్ ఇచ్చింది. ఇరాన్‌తో నిర్మాణాత్మక చర్చలు జరుగుతున్నాయని, అందుకే ఆ దేశ విద్యుత్ కేంద్రాలపై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నానని చేసిన ప్రకటనను ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ పరిణామంపై ఇరాన్ అధికారిక మీడియా, రాయబార కార్యాలయాల ప్రతినిధులు కీలక ప్రకటన చేసారు. ఇరాన్ ఇంధన వనరులపై దాడులను 5 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించగా, ఇరాన్ మాత్రం దీనిపై రియాక్ట్ అయింది.
ట్రంప్ చేసిన చర్చల వాదనలో ఏమాత్రం నిజం లేదని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ స్పష్టం చేసింది. ఇరాన్ ఇచ్చిన గట్టి హెచ్చరికలు, ప్రతీకార దాడుల భయంతోనే ట్రంప్ తన 48 గంటల డెడ్‌లైన్‌ను వాయిదా వేసుకున్నారని, ఇది అమెరికా వెనక్కి తగ్గడమేనని ఇరాన్ మీడియా పేర్కొంది. అమెరికాతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి చర్చలు జరగడం లేదని, ట్రంప్ చెబుతున్నవన్నీ అసత్యాలని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధులు కొట్టిపారేశారు. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
ఇవి కూడా చదవండి
చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ మాటలు కేవలం ఆయన భ్రమ మాత్రమేనని, యుద్ధంలో గెలవలేక ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేసింది. ఒకవేళ అమెరికా దాడులకు దిగితే, మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలకు విద్యుత్ అందించే కేంద్రాలను తాము లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ పునరుద్ఘాటించింది. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత శనివారం ఇరాన్‌కు 48 గంటల గడువు విధించారు. హర్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ విద్యుత్ గ్రిడ్‌ను నాశనం చేస్తామని హెచ్చరించారు.
అయితే, సోమవారం ఆ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందే, చర్చలు ఫలవంతంగా సాగుతున్నాయని, అందుకే మరో 5 రోజులు దాడులు చేయబోమని ట్రంప్ ప్రకటించారు. ఈ తాజా పరిణామంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు(Crude Oil) స్వల్పంగా తగ్గినప్పటికీ, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మాత్రం తగ్గలేదు. ఇరాన్ ప్రభుత్వం ట్రంప్ ప్రకటనను అమెరికా బలహీనతగా అభివర్ణిస్తూ తన పట్టును మరింత బిగించింది.
ఇవి కూడా చదవండి








