Donald Trump: యుద్దానికి బ్రేక్ వేసిన ట్రంప్..!
ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. పశ్చిమాసియాలో గత కొద్ది రోజులుగా ఉత్కంఠ రేపుతున్న ఇరాన్-అమెరికా(Iran-America) యుద్ధంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై జరపాల్సిన క్షిపణి దాడులను 5 రోజుల పాటు నిలిపివేయాలని ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
గత రెండు రోజులుగా ఇరాన్ మరియు అమెరికా మధ్య అత్యంత నిర్మాణాత్మకమైన, మంచి చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఈ చర్చల సరళి ఆశాజనకంగా ఉండటంతో, సమస్య పరిష్కారానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో దాడులను వాయిదా వేయాల్సిందిగా అమెరికా రక్షణ శాఖను (Department of War) ఆదేశించినట్లు తెలిపారు. ఇదే సమయంలో వాణిజ్య నౌకల రాకపోకల కోసం హార్ముజ్ జలసంధిని (Strait of Hormuz) వెంటనే తెరవాలని, లేనిపక్షంలో ఇరాన్ విద్యుత్ వ్యవస్థను తుడిచిపెట్టేస్తామని ట్రంప్ అంతకుముందు 48 గంటల గడువు విధించారు.
ఇవి కూడా చదవండి
తాజాగా జరిగిన చర్చల నేపథ్యంలో ఈ గడువును పొడిగించినట్లయింది. ఇరాన్ క్షిపణి వ్యవస్థలను, వైమానిక మరియు నౌకా దళాలను అమెరికా ఇప్పటికే దెబ్బతీసిందని, యుద్ధ లక్ష్యాలను చేరుకోవడానికి తాము చాలా దగ్గరలో ఉన్నామని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, ఇది కేవలం దాడుల వాయిదా మాత్రమేనని, దీనిని పూర్తిస్థాయి కాల్పుల విరమణ (Ceasefire) గా భావించవద్దని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లలో ఉత్సాహం నెలకొంది. స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకోగా, ముడి చమురు ధరల పెరుగుదలపై ఆందోళనలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ 5 రోజుల విరామంలో జరిగే చర్చలు సఫలమైతే పశ్చిమాసియాలో శాంతి నెలకొనే అవకాశం ఉంది. లేదంటే, ట్రంప్ హెచ్చరించినట్లుగా ఇరాన్ ఇంధన వ్యవస్థపై అమెరికా మరింత భీకరంగా విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉంది. అయితే ఇరాన్ కయ్యానికి కాలు దువ్వితే మరింత తీవ్రంగా దాడులు చేస్తామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి








