Iran: ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ‘గుండెకాయ’ ఆ ద్వీపమే..!
పశ్చిమాసియాలో(Middle East) యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్(Iran) తీరానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖార్గ్ ద్వీపం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది కేవలం 20 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన చిన్న పగడపు దీవి అయినప్పటికీ, ఇరాన్ ఆర్థిక వ్యవస్థను శాసించే శక్తి దీనికి ఉంది. చమురు ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా ఉంది. ఇరాన్ ప్రపంచానికి ఎగుమతి చేసే ముడి చమురులో(Cruide oil) సుమారు 90 నుండి 95 శాతం ఈ ఒక్క ద్వీపం నుంచే రవాణా అవుతుంది. ఇక్కడి టెర్మినల్స్ ద్వారా ఏటా సుమారు 95 కోట్ల బ్యారెళ్ల చమురు ప్రపంచ మార్కెట్లకు చేరుకుంటుంది.
ఇవి కూడా చదవండి
ఇరాన్ తీర ప్రాంతం చాలా వరకు లోతు తక్కువగా ఉంటుంది, దీనివల్ల భారీ చమురు ట్యాంకర్లు నేరుగా తీరానికి రాలేవు. కానీ ఖార్గ్ ద్వీపం చుట్టూ నీరు చాలా లోతుగా ఉండటం వల్ల భారీ సూపర్ ట్యాంకర్లు సులభంగా ఇక్కడ ఆగగలవు. ఇరాన్‌లోని అతిపెద్ద చమురు క్షేత్రాలైన అహ్వాజ్, మరున్ మరియు గచ్సరన్ నుండి పైప్లైన్ల ద్వారా ముడి చమురు నేరుగా ఈ ద్వీపానికి చేరుకుంటుంది. ఇక్కడ సుమారు 30 మిలియన్ బ్యారెళ్ల చమురును నిల్వ చేసే సామర్థ్యం ఉంది.
ఇరాన్ ప్రభుత్వం మరియు సైనిక దళాలకు (IRGC) అవసరమైన నిధుల్లో సింహభాగం ఈ ద్వీపం ద్వారా జరిగే చమురు విక్రయాల నుంచే వస్తుంది. ముఖ్యంగా చైనా వంటి దేశాలకు ఇక్కడి నుండే చమురు భారీగా సరఫరా అవుతుంది. ఇటీవల ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల మధ్య, అమెరికా ఈ ద్వీపంలోని సైనిక స్థావరాలపై దాడులు చేసినప్పటికీ, చమురు మౌలిక సదుపాయాలను మాత్రం తాకలేదు. దీనిపై దాడి జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు అమాంతం పెరిగి తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఈ చిన్న ద్వీపాన్ని ఇరాన్ యొక్క “క్రౌన్ జ్యువెల్” లేదా “చమురు లైఫ్ లైన్” అని పిలుస్తారు.








