Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
మత మార్పిడిలు, రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు అత్యంత కీలక తీర్పును వెలువరించింది. హిందూ మతం నుండి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తులు తమ షెడ్యూల్డ్ కులాల (SC) హోదాను, దానికి సంబంధించిన రాజ్యాంగపరమైన హక్కులను కోల్పోతారని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(Ap High Court) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి క్రైస్తవ మతాన్ని స్వీకరించి, పాస్టర్‌గా సేవలందిస్తున్నారు. అయితే, తన వద్ద ఉన్న పాత ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్(Caste Certificate) ఆధారంగా తనపై జరిగిన ఒక గొడవలో ‘ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ’ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరారు.
దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. ఒకసారి మతం మారిన తర్వాత ఎస్సీ హోదా చెల్లదు అని తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, హైకోర్టు నిర్ణయమే సరైనదని తేల్చి చెప్పింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ రిజర్వేషన్లు లేదా ఆ హోదా కింద లభించే ప్రభుత్వ ప్రయోజనాలు పొందే అర్హత ఉండదని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ కులాల ఉత్తర్వు (1950) ప్రకారం.. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను అనుసరించేవారు మాత్రమే ఎస్సీలుగా పరిగణించబడతారని తేల్చి చెప్పింది.
ఇవి కూడా చదవండి
క్రైస్తవ లేదా ఇస్లాం మతాల్లో కుల వివక్ష ఉండదు కాబట్టి, ఆ మతాల్లోకి మారిన వారికి ఎస్సీ హోదా వర్తించదని, ఒక వ్యక్తి వద్ద ఫిజికల్‌గా ఎస్సీ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ, అతను క్రైస్తవ ఆచారాలను పాటిస్తున్నట్లు నిరూపితమైతే.. ఆ సర్టిఫికేట్ చెల్లదని కోర్టు స్పష్టం చేసింది. ఎస్సీ హోదా కోల్పోయిన వ్యక్తిపై అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయడం కుదరదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ తీర్పు తెలుగు రాష్ట్రాల్లోని మత మార్పిడి చేసుకున్న వేలాది మందిపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ఎస్సీ సర్టిఫికేట్లతో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యార్థుల స్కాలర్షిప్లు పొందుతున్న వారికి ఇది పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి








