China: చైనాకు షాక్.. భారత్కు చేరుకున్న రష్యా చమురు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఇంధన సంక్షోభం నేపథ్యంలో, అంతర్జాతీయ చమురు మార్కెట్లో చోటు చేసుకున్న మార్పులతో భారత్(India) ఇబ్బంది పడుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనాకు ముడి చమురును రవాణా చేస్తున్న ఏడు రష్యన్ ట్యాంకర్లు దక్షిణ చైనా సముద్రంలో ‘యూ-టర్న్’ తీసుకుని భారత్ వైపుకు వస్తున్నాయి. ఈ ఏడు నౌకలలో మొదటిదైన ‘ఆక్వా టైటాన్’, శనివారం సాయంత్రం కర్ణాటకలోని(Karnataka) న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంది. ఇది సుమారు 7.7 లక్షల బ్యారెళ్ల (1.1 లక్షల టన్నుల) యురల్స్ ముడి చమురును మోసుకొచ్చింది.
మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్(Iran-Israel) యుద్ధం కారణంగా హర్ముజ్ జలసంధి గుండా సరఫరాకు ఆటంకం కలిగింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం చమురు నిల్వలను పెంచేందుకు రష్యా నుంచి దిగుమతులను వేగవంతం చేసింది. రష్యాపై ఆంక్షలు ఉన్నప్పటికీ, సముద్రంలో చిక్కుకుపోయిన శాంక్షన్డ్ రష్యా చమురును కొనుగోలు చేసేందుకు అమెరికా భారత్కు తాత్కాలిక మినహాయింపునివ్వడం ఈ మళ్లింపునకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. జనవరి చివరిలో బాల్టిక్ సముద్ర ఓడరేవులో సరుకును నింపుకున్న ఆ ట్యాంకర్, వాస్తవానికి చైనాలోని రిజావో ఓడరేవుకు వెళ్లాల్సి ఉంది.
ఆక్వా టైటాన్ తర్వాత, ‘సూయెజ్మ్యాక్స్ జౌజౌ ఎన్’ అనే మరో భారీ ట్యాంకర్ మార్చి 25న గుజరాత్లోని సిక్కా పోర్టుకు చేరుకోనుంది. ఒకే వారంలో దాదాపు 30 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును భారత్ కొనుగోలు చేసింది. రష్యా నుంచి తక్కువ ధరకే చమురు లభిస్తుండటం భారత్ ఇంధన భద్రతను బలోపేతం చేయడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తోంది. ఈ పరిణామం రష్యా-భారత్ మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక సంబంధాలకు నిదర్శనంగా అంతర్జాతీయ మీడియా విశ్లేషిస్తోంది.
ఇవి కూడా చదవండి








