Baloch Army: పాక్ సైన్యం, ఉగ్రవాదులను తరిమికొట్టిన బలూచ్ ఆర్మీ ..!
లక్షల సైన్యం ఉన్న పాకిస్తాన్ ను.. వేల సంఖ్యలో ఉన్న సైనికులతో బలూచ్ ఆర్మీ బెంబేలెత్తిస్తోంది. బలూచ్ ప్రభావం ఉన్న ఏరియాలో విధులు నిర్వహించాలన్న పాక్ సైనికులకు ఆందోళన పెరిగిపోతోంది. క్వెట్టా సహా పలు ప్రాంతాలకు వెళ్లాలంటే వారు భయపడిపోతున్నారు. లాంగ్ లీవ్స్ పెట్టేసి, సొంతూళ్లకు పారిపోతున్నారు దీంతో వారిని ఎలా ఎదుర్కోవాలో అర్థంకాక పాకిస్తాన్ తల పట్టుకుంటోంది. దీంతో వీరిని సైన్యంతో కాదు నిషేధిత ఉగ్రవాద సంస్థలతో నిలువరించాలని ప్రయత్నిస్తోంది.అయితే డబ్బుకు పనిచేసే కిరాయిమూకలు.. ఉద్యమ తీవ్రతతో ప్రాణాలర్పిస్తున్న బలూచ్ ఆర్మీని ఎదుర్కోలేకపోతున్నాయి.
బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ), తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) లాంటి సాయుధ గ్రూపులను ఎదుర్కోవడం పాకిస్థాన్ సైన్యానికి కత్తిమీద సాములా మారింది. ఈ క్రమంలో పాక్ సైన్యం, దాని గూఢచార సంస్థ ఐఎస్ఐ వేసిన ఓ ఎత్తుగడ దారుణంగా విఫలమైంది. లష్కరే తోయిబా, ఐఎస్కేపీ ఉగ్రవాద సంస్థలను ఏకం చేసి బీఎల్ఏపైకి ఉసిగొల్పాలన్న వ్యూహం బెడిసికొట్టింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
బీఎల్ఏ ఆర్మీ…’ఆపరేషన్ హీరోఫ్ ఫేజ్ 2′ పేరుతో క్వెట్టా సహా పలు ప్రాంతాల్లో భారీ దాడులకు పాల్పడింది. ఈ దాడులు ఏకధాటిగా 40 గంటలకు పైగా కొనసాగాయి. ఈ ఘటనల్లో సుమారు 200 మంది పాకిస్థాన్ సైనికులను మట్టుబెట్టినట్లు బీఎల్ఏ ప్రకటించింది. అయితే, బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ మాత్రం 17 మంది భద్రతా సిబ్బంది, 31 మంది పౌరులు మరణించినట్లు తెలిపారు. ఈ దాడుల తీవ్రతను ఎదుర్కోవడంలో లష్కరే, ఐఎస్కేపీ ఉగ్రమూకలు విఫలమవడంతో పాక్ ప్రభుత్వం అంతర్జాతీయంగా పరువు కోల్పోయింది.
బలూచ్ పోరాటం ఇప్పుడు కేవలం ఒక సాయుధ తిరుగుబాటుగా కాకుండా ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటోంది. బలూచ్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు వస్తుండటంతో సైన్యానికి పరిస్థితి కష్టంగా మారింది. ఈ పోరాటంలో మహిళలు కూడా పాల్గొనడం గమనార్హం. ఆసిఫా మెంగల్ అనే మహిళ నోష్కిలోని ఐఎస్ఐ ప్రధాన కార్యాలయంపై వాహనంతో ఆత్మాహుతి దాడికి పాల్పడింది. దాడుల్లో మహిళల పాత్ర ఉందని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కూడా అంగీకరించారు.
బీఎల్ఏ కమాండర్ బషీర్ జైర్ … బలోచ్ ప్రజలంతా సమీకృతం కావాలని పిలుపునివ్వడం పాక్ ప్రభుత్వానికి మింగుడుపడడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉగ్రవాద సంస్థలను ప్రయోగించడం కంటే బలూచ్ నేతలతో చర్చలు జరిపి వారి డిమాండ్లను అంగీకరించడం మేలని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. బీఎల్ఏ దెబ్బకు భయపడి లష్కరే, ఐఎస్కేపీ లాంటి సంస్థలు ఈ పోరాటం నుంచి తప్పుకునే అవకాశాలున్నాయని, వాటిలో ఉన్న చాలామందికి ఈ యుద్ధం చేయడం ఇష్టం లేదని తెలుస్తోంది. ఈ ప్రయోగం విఫలం కావడంతో భవిష్యత్తులో జైషే మహ్మద్ లాంటి ఇతర ఉగ్రసంస్థలను రంగంలోకి దించడం దాదాపు అసాధ్యమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.






