European Army: యూరప్ ఆర్మీ ఏర్పాటు సాధ్యమేనా..?
యూరోపియన్ యూనియన్ .. అభివృద్ధి చెందినదేశాల సమూహం. అత్యంత శక్తిమంతమైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ.. సహా పలుదేశాల సముదాయం. ఇది ఇప్పటివరకూ ప్రపంచానికి ఉన్న అంచనా. కానీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. యూరప్ దేశాలు ఎంత బలహీనమైనవో తేల్చేశారు. నాటో వదులుకుంటే.. మీ భూభాగాలను సైతం రక్షించుకోలేరని స్ట్రయిట్ వార్నింగిచ్చేశారు కూడా. తర్వాత వెనక్కు తగ్గడం సంగతి పక్కన పెడితే.. ఈపరిణామం మాత్రం యూరోపియన్ యూనియన్ ను ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే.. నాటో చీఫ్ కూడా అమెరికా సపోర్ట్ లేకపోతే.. మీరు సురక్షితంగా ఉండడం కలే అని స్పష్టం చేశారు.
గ్రీన్లాండ్ విషయంలో ఇటీవల అమెరికా, ఐరోపా దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో యురోపియన్ ఆర్మీ ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే, దీన్ని ఈయూ ఫారిన్ పాలసీ చీఫ్ కాజా కల్లాస్ వ్యతిరేకించారు. European army ఏర్పాటు చాలా ప్రమాదకరమని హెచ్చరించారు.
యూరప్ కు సైన్యం అవసరమని చెప్పేవారు.. బహుశా ఈ విషయాన్ని ప్రాక్టికల్‌గా ఆలోచించి ఉండరు. యూరప్ దేశాలు ఇప్పటికే నాటోలో ఉన్న నేపథ్యంలో.. ఒక ప్రత్యేక సైన్యాన్ని సృష్టించలేరు. యుద్ధం వంటి సంక్షోభ సమయాల్లో ‘ఎవరు ఎవరికి ఆదేశాలు జారీ చేస్తారు?’ అనేది ముఖ్యమైన అంశం. ఒకవేళ నాటో, యూరప్ సైన్యం రెండూ ఉంటే.. అప్పుడు పరిస్థితి గందరగోళంగా మారుతుంది. ఇది అత్యంత ప్రమాదకరం’’ అని నార్వేలో నిర్వహించిన ఓ భద్రతా సమావేశంలో కల్లాస్ వ్యాఖ్యానించారు.నార్వే ప్రధాని జోనాస్ సైతం యురోపియన్ ఆర్మీ అంశాన్ని వ్యతిరేకించారు. నాటో స్వతహాగా సంక్లిష్టమైనదని, అయినప్పటికీ.. పనిచేయగలదని తెలిపారు.
రక్షణ విషయంలో అమెరికా, నాటోపై ఆధారపడాల్సి రావడం, ఉక్రెయిన్- రష్యా యుద్ధం, గ్రీన్లాండ్ విషయంలో అమెరికా వైఖరి వంటి పరిణామాల నేపథ్యంలో యురోపియన్ ఆర్మీ ఏర్పాటు అంశం చర్చల్లో నిలుస్తోంది. యూరప్ తనను తాను రక్షించుకునేలా ఓ సైన్యం అవసరమని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ చాలా కాలంగా చెబుతున్నారు. లక్షమందితో ప్రత్యేక సైన్యం అవసరమని యురోపియన్ కమిషనర్ ఫర్ డిఫెన్స్ అండ్ స్పేస్ ఆండ్రియస్ కుబిలియస్ ఇటీవల చెప్పారు. జర్మనీ, స్పెయిన్ దేశాలూ ఇదే విధమైన వాదనలు వినిపించాయి.






