Iran: ఇరాన్ లో అండర్ గ్రౌండ్ మిస్సైల్ బేస్ లు.. అమెరికాలో అలజడి..!
వెనెజువెలాను కేవలం గంటల వ్యవధిలో వశం చేసుకున్న అమెరికా.. ఇరాన్ పై మాత్రం దాడికి తటపటాయిస్తోంది. ఓవైపు యుద్ధనౌకలు మోహరిస్తూ, ఒత్తిడి పెంచుతూ వస్తోంది. మరీ ముఖ్యంగా మిత్రదేశాలైన గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న రిక్వెస్టులు అమెరికాను ఆలోచనలో పడేస్తున్నాయి. పనిలోపనిగా ఇరాన్ సైతం.. తాము రక్షణ నుంచి దాడులు చేసే స్థాయికి తమ రక్షణ పాటవాన్ని పెంచుకున్నామని ప్రపంచానికి వార్నింగిస్తోంది . ఈపరిణామాలు అమెరికాను ఆందోళనకు గురిచేస్తోంది.
పశ్చిమాసియాలో ఇరాన్ పై దాడికి దిగితే.. దాని పర్యవసానంగా తమపై ఎలా ఉంటుందో అమెరికా మిత్రదేశాలకు తెలుసు. ముఖ్యంగా ఖతార్, యూఏఈ సహా పలుదేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ సైతం క్షిపణుల వర్షం కురిపిస్తుంది. ఫలితంగా ఆయాదేశాలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇది ఆదేశాలకు రుచించనివిషయం అందుకే అవి.. ఇరాన్ పై దాడికి దిగొద్దని అగ్రరాజ్యాన్ని వేడుకుంటున్నాయి.
పనిలో పనిగా ఇరాన్.. తన సైనిక పరాక్రమాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. అమెరికాతో గరిష్ఠ స్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఒక అత్యాధునిక ‘అండర్ గ్రౌండ్ మిస్సైల్ బేస్’ను ఆవిష్కరించింది. ఇరాన్ సైనిక దళాల అధిపతి అబ్దోల్రహీమ్ మౌసవి ఈ కేంద్రాన్ని సందర్శించి, క్షిపణి యూనిట్ల సన్నద్ధతను స్వయంగా పరిశీలించారు.
ముఖ్యంగా, ఇరాన్ తన సైనిక సిద్ధాంతాన్ని రక్షణ నుంచి దాడుల శైలికి మార్చినట్లు మౌసవి ప్రకటించడం అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. గత ఏడాది ఇజ్రాయెల్‌తో జరిగిన 12 రోజుల యుద్ధం తర్వాత, కేవలం ఎదురుదాడి చేయడమే కాకుండా.. శత్రువుపై మెరుపు వేగంతో విరుచుకుపడేలా తమ క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికా గనుక ఏ చిన్న తప్పు చేసినా, ఆ ప్రాంతంలో ఉన్న అమెరికా పౌరులకు కానీ, వారి స్థావరాలకు కానీ రక్షణ ఉండదని ఘాటుగా హెచ్చరించారు.
ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తన విమాన వాహక నౌకలను మోహరించడంతో పాటు, ఇరాన్ డ్రోన్లను కూల్చివేస్తూ ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు, ఒమన్‌లో ఇరు దేశాల మధ్య రహస్య చర్చలు జరగనున్నాయన్న వార్తల నడుమ.. ఇరాన్ తన భూగర్భ క్షిపణి నగరాన్ని బయటపెట్టడం ద్వారా వాషింగ్టన్కు ఒక బలమైన సంకేతం పంపింది.






