India-US: అమెరికాతో ట్రేడ్ డీల్.. భారత్ కు బిగ్ బూస్ట్..!
ఎన్నో విమర్శలు.. మరెన్నో వార్నింగ్స్.. ఇంకా ఎన్నో అనుమానాలు.. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ అమెరికాతో మోడీ సర్కార్ ట్రేడ్ డీల్ చేసుకుంది. అయితే ఈ డీల్ కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే.. దీనికోసం భారత్ పై టారిఫ్ కత్తి సైతం దూశారు. తమతో డీల్ చేసుకోకుంటే … మరిన్ని టారిఫ్స్ విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. వీటన్నింటికీ .. రష్యా దగ్గర చమురు కొంటున్నారని సాకు చూపించారు ట్రంప్.
అయితే ఈ డీల్ కోసం.. భారత్ చాలా కాలం వేచి చూసింది. మన రైతుల ప్రయోజనాలు, ఆర్థికరంగానికి బూస్టిచ్చేలా నిర్ణయాలుండాలని ఆశించింది. ట్రంప్ ఎన్ని విధాలుగా ఒత్తిడి తెచ్చినా బలంగా తట్టుకుని నిలబడింది. ఆఖరుకు ఓ మంచి ఒప్పందాన్ని చేసుకుంది . ఇది మిగిలిన దేశాలతో అమెరికా కుదుర్చుకున్న ఢీల్స్ కన్నా చాలా బెటర్ అని అమెరికా వాణిజ్యరంగ నిపుణులే చెబుతున్నారంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.ఈ ఒప్పందం కేవలం పన్నుల తగ్గింపు మాత్రమే కాదు, ఆసియా ఖండంలోని మన ప్రధాన పోటీదారులైన చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలపై భారత్‌కు భారీ వాణిజ్య ఆధిక్యాన్ని కట్టబెట్టింది.
అమెరికా మార్కెట్లో ఇప్పటివరకు చైనా ఉత్పత్తులే రాజ్యమేలేవి. కానీ తాజా ఒప్పందం ప్రకారం చైనా వస్తువులపై అమెరికా సుమారు 37 శాతం వరకు సుంకాలు విధిస్తుంటే, భారత వస్తువులపై కేవలం 18 శాతం మాత్రమే విధిస్తోంది. అంటే, అమెరికా మార్కెట్లో చైనా వస్తువుల కంటే భారత వస్తువులు చాలా తక్కువ ధరకు లభిస్తాయి. దీనివల్ల అమెరికన్ కంపెనీలు చైనాను వదిలి భారత్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.కేవలం చైనానే కాదు, మన పొరుగున ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలతో పోల్చినా భారత్ మెరుగైన స్థితిలో ఉంది. వాస్తవంగా చూస్తే భారత్ పై 18 శాతం, పాకిస్తాన్ పై 19శాతం, బంగ్లాదేశ్ పై 20 శాతం, వియత్నాంపై 20 శాతం టారిఫ్ విధించారు ట్రంప్.
టెక్స్టైల్ (దుస్తులు), లెదర్, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతుల్లో బంగ్లాదేశ్, వియత్నాం మనకు గట్టి పోటీ ఇస్తుంటాయి. ఇప్పుడు వారి కంటే మనకు తక్కువ పన్ను ఉండటంతో, భారత ఎగుమతిదారులు గ్లోబల్ మార్కెట్లో తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులను అందించగలరు. ఇది మన దేశంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యానికి పెద్ద పీట వేయనుంది.
ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థలు ‘ఆపిల్’, ‘టెస్లా’ తమ సప్లై చైన్‌ను చైనా నుంచి భారత్‌కు మార్చే ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐఫోన్ తయారీలో భారత్ ఇప్పటికే చైనాను వెనక్కి నెడుతుండగా, ఈ 18 శాతం టారిఫ్ నిర్ణయం ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేయనుంది. ఇది భారత ఎగుమతులను ఏడాదికి అదనంగా 20-30 బిలియన్ డాలర్ల మేర పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.






