US-Iran War: ట్రంప్ నోట యుద్ధం ముగింపు మాట.. మంచి పరిణామమే..!
ఇరాన్ పై యుద్ధంలో నెగ్గలేమని అమెరికాకు అవగతమైందా..? మిత్రపక్షం ఇజ్రాయెల్ అంచనాలు తప్పాయన్న భావనలో అగ్రరాజ్యం ఉందా..? ట్రంప్ లేటెస్టు కామెంట్ చూస్తే ఎవరికైనా అదే అర్థమవుతుంది. ఇరాన్ కొమ్ములు వంచి, పాదాక్రాంతం చేసుకుంటామన్న అమెరికా అధ్యక్షుడు అకస్మాత్తుగా యుద్ద ముగింపు గురించి మాట్లాడారు. యధాలాపంగా అన్నారా..? నిజంగానే అటు దిశగా ఆలోచిస్తున్నారా.. ? అన్నదిపక్కన పెడితే ట్రంప్ నోట యుద్ధం ముగింపు మాట రావడం మాత్రం శుభపరిణామమంటున్నారు విశ్లేషకులు.
ఇరాన్‌తో యుద్ధం (Iran war) ముగించే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై సైనిక చర్యను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఇరాన్‌పై సాధించిన సైనిక విజయాలను వివరిస్తూ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఒక పోస్టు పెట్టారు. ఇరాన్‌పై మా లక్ష్యాలను చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నామన్నారు. మా సైనిక చర్యను ముగించే విషయంపై ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆ దేశ క్షిపణి సామర్థ్యాలను, వైమానిక, నావికా వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఆ దేశం మరోసారి అణ్వాయుధాలను తయారుచేయకుండా అమెరికా చూసుకుంటుందన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే.. తాము తగినవిధంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఇక, అమెరికా దాని మిత్ర దేశాలకు భద్రత కల్పించిందని ట్రంప్ అన్నారు. ‘ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ సహా పశ్చిమాసియాలోని మిత్ర దేశాలకు అత్యున్నత స్థాయిలో రక్షణ కల్పిస్తున్నాం’ అని రాసుకొచ్చారు.
ఈ సందర్భంగా హర్మూజ్ (HORMUZ) జలసంధి గురించి కూడా ట్రంప్ కీలక ప్రకటన చేశారు. దీనిపై ఆధారపడిన దేశాలు నౌకల సురక్షిత ప్రయాణానికి బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికా రక్షణ కల్పించదని స్పష్టం చేశారు. ఒకవేళ తమ సాయం కోరితే.. సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇరాన్ ముప్పు తొలగిపోయిన తర్వాత ఆ అవసరం ఉండదన్నారు.
ఇవి కూడా చదవండి








