Donald Trump: ఇరాన్ కోసం ట్రంప్ 15 పాయింట్ల గైడ్ లైన్స్ .. యురేనియం అప్పగించాల్సిందేనని స్పష్టీకరణ
Donald Trump: పశ్చిమాసియాలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇరాన్‌తో కాల్పుల విరమణ కోసం 15 పాయింట్లతో కూడిన ఒక సమగ్ర శాంతి ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ రహస్య ప్రతిపాదనలను పాకిస్థాన్ ప్రతినిధుల ద్వారా ఇరాన్ ప్రభుత్వానికి చేరవేసినట్లు ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం వెల్లడించింది. అయితే, ఈ కీలక పరిణామం గురించి ఇజ్రాయెల్‌కు అమెరికా ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.
ట్రంప్ ప్రతిపాదించిన ప్రధాన షరతులు ఇవే:
ఈ శాంతి ఒప్పందం అమలు కావాలంటే ఇరాన్ కింది కఠినమైన నిబంధనలకు అంగీకరించాలని అమెరికా కోరింది.
అణు కేంద్రాల నిర్వీర్యం: నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్దో వంటి ప్రధాన అణు కేంద్రాలను ఇరాన్ తప్పనిసరిగా ధ్వంసం చేయాలి.
అణ్వాయుధాల నిషేధం: భవిష్యత్తులో ఎన్నటికీ అణ్వాయుధాలను సమకూర్చుకోబోమని ఇరాన్ లిఖితపూర్వక హామీ ఇవ్వాలి.
యురేనియం అప్పగింత: ఇరాన్ వద్ద నిల్వ ఉన్న 450 కిలోల యురేనియంను వెంటనే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA)కు అప్పగించాలి. అలాగే ఇరాన్ భూభాగంపై అణుశుద్ధి ప్రక్రియను నిలిపివేయాలి.
ఇవి కూడా చదవండి
హర్మూజ్ జలసంధి: అంతర్జాతీయ నౌకాయానానికి ఆటంకం కలగకుండా హర్మూజ్ జలసంధిని ‘ఫ్రీ మారిటైమ్ కారిడార్’గా నిర్వహించాలి.
క్షిపణి నియంత్రణ: ఇరాన్ తన క్షిపణి కార్యక్రమాలను కేవలం ఆత్మరక్షణకు మాత్రమే పరిమితం చేయాలి. వాటి పరిధిని, సంఖ్యను గణనీయంగా తగ్గించుకోవాలి.
అమెరికా ఆఫర్ :
ఈ షరతులకు ఇరాన్ అంగీకరిస్తే, ఆ దేశంపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తామని అమెరికా హామీ ఇచ్చింది. అంతేకాకుండా, పౌర అవసరాల కోసం అణు ఇంధన శక్తిని పెంపొందించుకోవడానికి అవసరమైన సాంకేతిక సాయం అందిస్తామని తెలిపింది. అయితే, ఒకవైపు శాంతి చర్చలు జరుపుతూనే, మరోవైపు పశ్చిమాసియాకు అదనంగా 1,000 మంది సైనికులతో పాటు రెండు మెరైన్ యూనిట్లను పంపేందుకు పెంటగాన్ సన్నాహాలు చేస్తోంది.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) స్పందన:
అమెరికా ప్రతిపాదించిన ఈ సీజ్ఫైర్ ప్లాన్‌పై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తీవ్రంగా స్పందించింది. యుద్ధంలో ఎదురైన ఓటమిని శాంతి ఒప్పందంగా చిత్రీకరించవద్దని అమెరికాను హెచ్చరించింది. “ఈ ప్రాంతంలో మీ పెట్టుబడులను మేము అంగీకరించబోము” అని ఐఆర్జీసీ ప్రతినిధి స్పష్టం చేస్తూ, అమెరికాతో జరుగుతున్న చర్చల వార్తలను ఖండించారు.
ఇవి కూడా చదవండి








