బంపర్ పోలింగ్… తమిళనాడులో 82.24 శాతం, బెంగాల్ లో 89.93 శాతం
తమిళనాడు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రెండు రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకూ తమిళనాడులో 82.24 శాతం పోలింగ్ నమోదు కాగా, పశ్చిమ బెంగాల్ లో 89.93 శాతం పోలింగ్ నమోదైంది. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం ప్రకటించింది. చెన్నైలో 81.34 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. అలాగే బెంగాల్ లోని దక్షిణ్ దినాజ్ పుర్ లో అత్యధికంగా 93.12 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల కల్లా పోలింగ్ ముగిసింది. అయితే.. అప్పటికే లైన్లో నిలుచున్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు.
తమిళనాడు మొత్తం 234 స్థానాలు, బెంగాల్ లో తొలి విడతలో భాగంగా 152 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ఎండలు, వేడి అధికంగా వున్నా… ఓటర్లు ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చారు. బెంగాల్ లో తొలివిడతలో భాగంగా 152 స్థానాల్లో పోలింగ్ నడుస్తుండగా.. తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 11 గంటల వరకూ తమిళనాడులో 37.56 శాతం పోలింగ్ నమోదు కాగా, బెంగాల్ లో 41.11 శాతం ఓటింగ్ నమోదైంది.
బెంగాల్ లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో పోలింగ్ జరిగిన శాతం..
అలిపుర్ దూర్ – 88.74 శాతం
బంకూర – 89.91 శాతం
బీర్బూమ్ – 91.55 శాతం
కొచ్చేబేహార్ – 92.07 శాతం
దక్షిణ్ దినాజ్ పూర్ – 93.12 శాతం
డార్జిలింగ్ – 86.49 శాతం
జల్పై గురి – 91.20 శాతం
ఝార్ గ్రామ్ – 90.53 శాతం
ముర్షీదాబాద్ – 91.36 శాతం
పశ్చిమ మిడ్నాపూర్ – 90.70 శాతం
ఇక.. బెంగాల్ లో గతంలో కంటే ఈ సారి రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. 2011 లో 84.72 శాతం, 2016 లో 83.02 శాతం, 2021 లో 82.30 శాతం పోలింగ్ జరిగింది.
మరోవైపు బెంగాల్ లోని కొన్ని ప్రాంతాలలో తీవ్ర ఘర్షణలు జరిగాయి. ఖ్యంగా ముర్షిదాబాద్, కూచ్, బెహార్, సిలిగురి, మాల్దాలలో హింసాత్మక వాతావరణం నెలకొంది. ముర్షీదాబాద్ లో దుండగులుAJUP అధినేత, రెజినగర్ అభ్యర్థి అయిన హుమాయున్ కబీర్ కారుపై కర్రలతో, ఇటుకలతో దాడికి దిగారు. అంతేకాకుండా ఆయన కాన్వాయ్ పై కూడా దాడి జరిగింది. దీంతో అధికార టీఎంసీ కార్యకర్తల మధ్య, AJUP కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసు అధికారులతో కూడా వాగ్వాదానికి దిగారు. దీనిపై వెంటనే దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
మరో వైపు కూచ్ బెహార్ లోని తుఫాన్ గంజ్ ప్రాంతంలో కూడా పోలింగ్ సమయంలో ఓటర్లు భారీగా గుమిగూడారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అదుపు తప్పే ప్రమాదం వుందని గ్రహించిన అధికారులు, అక్కడ కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్వల్పంగా లాఠీఛార్జి చేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఇవి కూడా చదవండి








