TVK: ఎన్డీఏలో చేరే ప్రసక్తే లేదు.. బీజేపీ మా సైద్ధాంతిక శత్రువు: టీవీకే
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ముఖ్యంగా దళపతి విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరబోతోందంటూ గత కొద్ది రోజులుగా నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై టీవీకే పార్టీ తీవ్రంగా స్పందించింది. ఎన్డీఏతో పొత్తు వార్తలను పూర్తిగా ఖండిస్తూ, ఈ రాజకీయ ఊహాగానాలకు అధికారికంగా ముగింపు పలికింది.
డీఎంకే మైండ్ గేమ్
ఈ వ్యవహారంపై టీవీకే (TVK) జనరల్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ ‘ఎక్స్’ వేదికగా పార్టీ వైఖరిని అత్యంత స్పష్టంగా వెల్లడించారు. అధికార డీఎంకే పార్టీయే ఉద్దేశపూర్వకంగా తమ అనుకూల మీడియా, సోషల్ మీడియా ద్వారా ఈ తప్పుడు ప్రచారానికి తెరతీసిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న వైఫల్యాలు, వాస్తవ ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే డీఎంకే ఈ తరహా మైండ్ గేమ్‌కు పాల్పడుతోందని విమర్శించారు.
విజయ్ను సీఎం అభ్యర్థిగా అంగీకరిస్తారా?
బీజేపీతో పొత్తుపై వస్తున్న వార్తలను నిర్మల్ కుమార్ కొట్టిపారేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “బీజేపీ మాకు సైద్ధాంతిక శత్రువు. మా సిద్ధాంతాలకు, వారి విధానాలకు పొంతన లేదు. అలాంటప్పుడు టీవీకే (TVK) పార్టీ ఎన్డీఏలో చేరే ప్రశ్నే తలెత్తదు. ఈ విషయాన్ని మా పార్టీ గతంలోనే చాలా స్పష్టంగా ప్రకటించింది” అని కుండబద్దలు కొట్టారు. ఒకవేళ ఎన్డీఏలో టీవీకే చేరుతుందనే ప్రచారం నిజమే అని భావిస్తే.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్ను బీజేపీ అధిష్ఠానం అంగీకరిస్తుందా? అని ఆయన లాజికల్ ప్రశ్న సంధించారు.
కార్యకర్తలకు అధిష్టానం దిశానిర్దేశం
ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలు చేసే ఇలాంటి తప్పుడు వదంతులను నమ్మి గందరగోళానికి గురికావొద్దని టీవీకే (TVK) అధిష్టానం క్షేత్రస్థాయి శ్రేణులకు సూచించింది. కేవలం పార్టీ అధికారిక సమావేశాలు, లెటర్ హెడ్‌పై వచ్చే అధికారిక ప్రకటనల ద్వారా వెలువడే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని స్పష్టం చేసింది. తాజా ప్రకటనతో ఒంటరి పోరుకే విజయ్ మొగ్గుచూపుతున్నారన్న విషయం తమిళ రాజకీయాల్లో స్పష్టమైంది.








