Sashi Tharoor: కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు: శశి థరూర్ స్పష్టత
కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ (Sashi Tharoor) పార్టీ మారుతున్నారన్న వార్తలకు చెక్ పెట్టారు. కాంగ్రెస్‌లోనే తాను కొనసాగుతానని, పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కూటమి విజయం కోసం ముందుండి పోరాడతానని ఆయన వెల్లడించారు. పార్లమెంట్ కాంప్లెక్స్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో థరూర్ (Sashi Tharoor) సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సుమారు గంటా 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో పార్టీలోని అంతర్గత సమస్యలపై చర్చించి, విభేదాలను పరిష్కరించుకున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత థరూర్ (Sashi Tharoor) మీడియాతో మాట్లాడుతూ.. “పార్టీలో అన్నీ సవ్యంగా ఉన్నాయి. రాహుల్ గాంధీ మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడే నాయకుడు, ఆయన విజన్ స్పష్టంగా ఉంటుంది” అని కొనియాడారు.
ఇటీవల కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ తనను సరిగ్గా గుర్తించలేదని, రాష్ట్ర నాయకత్వం తనను పక్కన పెడుతోందని థరూర్ (Sashi Tharoor) అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అందుకే ఆయన పార్టీ వ్యూహ కమిటీ సమావేశానికి కూడా డుమ్మా కొట్టారని తెలిసింది. అయితే తాజా భేటీతో ఈ వివాదాలకు తెరపడినట్లయింది. పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా తానెప్పుడూ మాట్లాడనని, అయితే అభివృద్ధి విషయాల్లో మంచిని మంచి అని చెప్పడం తన వ్యక్తిగత అభిప్రాయమని థరూర్ వివరణ ఇచ్చారు.






