Supreme Court: దేశ వ్యవసాయ విధానం మారాలి.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచనలు
దశాబ్దాలుగా కేవలం వరి, గోధుమ పంటలపైనే ఆధారపడిన దేశ వ్యవసాయ విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. ఈ రెండు పంటలకే పరిమితం కాకుండా, రైతులు పప్పుధాన్యాల (Pulses) సాగు వైపు మళ్లేలా ప్రోత్సహించేందుకు సరికొత్త, సమగ్ర వ్యవసాయ విధానాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. పసుపు, బఠానీ తదితర పప్పు దినుసులను ఈ నెలాఖరు వరకు ఎలాంటి సుంకం లేకుండా (Duty-free) విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన అనుమతిని సవాల్ చేస్తూ ‘రైతు మహాపంచాయత్’ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా.. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. సుంకాలు లేకుండా దిగుమతి చేసుకునే విధానాన్ని కూడా కేంద్రం పునఃసమీక్షించాలని సూచించింది.
అంత స్థాయిలో వరి, గోధుమలా?
ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. దేశంలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న స్థాయిలో గోధుమలు, వరి వాస్తవంగా అవసరమా? అన్న కోణంలో ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని పేర్కొన్నారు. ఉత్తర భారతదేశంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడానికి మితిమీరిన వరి సాగే ప్రధాన కారణమని కోర్టు (Supreme Court) ఆందోళన వ్యక్తం చేసింది. భూగర్భ జలాలను సంరక్షించుకోవడంతో పాటు, ఆహార ఉత్పత్తిలో దేశం స్వావలంబన సాధించాలంటే.. ఉత్తర, మధ్య భారతంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ పప్పుధాన్యాల సాగును విరివిగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం నొక్కిచెప్పింది. రైతులు ఒకే రకమైన పంటలకు అతుక్కుపోకుండా, పంటల వైవిధ్యం (Crop Diversification) పాటించేలా వారికి సరైన ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
పప్పుధాన్యాల ఉత్పత్తిలో క్షీణత
గత మూడేళ్లుగా పర్యావరణ మార్పులు, వ్యాధులు, తెగుళ్ల కారణంగా దేశంలో పప్పుధాన్యాల దిగుబడి గణనీయంగా పడిపోయిందని ఈ విచారణలో వెల్లడైంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో సుమారు 273 లక్షల టన్నులుగా ఉన్న ఉత్పత్తి, 2022-23 నాటికి 261 లక్షల టన్నులకు, 2023-24లో ఏకంగా 242 లక్షల టన్నులకు క్షీణించిందని కేంద్ర ప్రభుత్వం కోర్టు (Supreme Court) దృష్టికి తీసుకొచ్చింది.
కనీస మద్దతు ధర (MSP) కల్పించాలి
పప్పుధాన్యాలు పండిస్తే వరి, గోధుమల స్థాయిలో దిగుబడి రాదన్న భయం, అలాగే పండిన పంటకు మార్కెట్లో కచ్చితమైన ధర దక్కుతుందో లేదో అన్న అభద్రతాభావం వల్లే రైతులు ఆ సాగుకు దూరంగా ఉంటున్నారని సుప్రీంకోర్టు (Supreme Court) విశ్లేషించింది. ఈ భయాలను పోగొట్టేందుకు, పప్పుధాన్యాలను సైతం కనీస మద్దతు ధరతో (MSP) ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్న స్పష్టమైన భరోసాను రైతులకు కల్పించాలని సూచించింది. అందుకోసం ఒక పటిష్టమైన విధానాన్ని ఏర్పాటు చేస్తేనే రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు ధైర్యంగా అడుగులు వేస్తారని ధర్మాసనం పేర్కొంది.
ఇవి కూడా చదవండి








