PM Narendra Modi: బడ్జెట్‌తో వికసిత భారత్‌కు బలమైన పునాది: ప్రధాని మోదీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రశంసల జల్లు కురిపించారు. ఈ బడ్జెట్‌ను “వికసిత భారత్ నిర్మాణానికి బలమైన పునాది”గా ఆయన అభివర్ణించారు. ఇది కేవలం ఒక ఆర్థిక పత్రం మాత్రమే కాదని, 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను ప్రతిబింబించే చరిత్రాత్మక దస్తావేజు అని కొనియాడారు.
బడ్జెట్ ప్రసంగం అనంతరం మోదీ (PM Narendra Modi) మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ దేశ ప్రగతి కోసం దూసుకెళ్తున్న “సంస్కరణల ఎక్స్‌ప్రెస్” (Reforms Express)కు కొత్త వేగాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూనే, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే విధంగా, వృద్ధికి పెద్దపీట వేసే విధంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. కేవలం ‘వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ’ ట్యాగ్‌తో భారతీయులు సంతృప్తిగా లేరని, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా సాధ్యమైనంత త్వరగా అవతరించాలని ఆకాంక్షిస్తున్నారని ప్రధాని మోడీ చెప్పారు. ఈ కలలను సాకారం చేసుకునే దిశలో ఈ బడ్జెట్ కీలక ముందడుగు అని కొనియాడారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇది ప్రధానంగా ‘యువశక్తి బడ్జెట్’ అని మోదీ (PM Narendra Modi) అభివర్ణించారు. బయో-ఫార్మా, సెమీకండక్టర్ మిషన్ 2.0, ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ వంటి రంగాలకు ఇచ్చిన ప్రోత్సాహం.. దేశ యువతకు అపారమైన అవకాశాలను కల్పిస్తుందన్నారు. అలాగే గ్లోబల్ డేటా సెంటర్ హబ్‌గా భారత్‌ను మార్చేందుకు పన్ను మినహాయింపులు ఇవ్వడం శుభపరిణామమని, ఇది భారీగా ఉపాధిని సృష్టిస్తుందని తెలిపారు. ఆర్థిక మంత్రిగా వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌ను ఈ సందర్భంగా ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు.






