పవన్ ఖేరాకు సుప్రీంలో చుక్కెదురు.. అస్సాం కోర్టుకే వెళ్లాలని ఆదేశం!
Pawan Khera: కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాకు న్యాయస్థానంలో ఊరట లభించలేదు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ భార్య రిణికి భూయాన్ శర్మ దాఖలు చేసిన కేసులో తనపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని ఆయన చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోసం అస్సాంలోని సంబంధిత కోర్టునే ఆశ్రయించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
అసలేం జరిగిందంటే..
ఇటీవల ఒక మీడియా సమావేశంలో పవన్ ఖేరా మాట్లాడుతూ.. అస్సాం సీఎం భార్య రిణికి భూయాన్ శర్మకు ఒకటి కంటే ఎక్కువ పాస్‌పోర్టులు ఉన్నాయని, విదేశాల్లో అక్రమ ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు. ఈ విషయాలను సీఎం తన ఎన్నికల అఫిడవిట్లో దాచారని ఆయన విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి దంపతులు తీవ్రంగా ఖండించారు. ఇదంతా అసత్య ప్రచారమని పేర్కొంటూ, రిణికి భూయాన్ శర్మ గువాహటిలో ఫిర్యాదు చేయడంతో ఖేరాపై కేసు నమోదైంది.
తాత్కాలిక ముందస్తు బెయిల్..
తెలంగాణ హైకోర్టు ఆదేశం: ఈ కేసులో అస్సాం కోర్టును ఆశ్రయించేందుకు వీలుగా తెలంగాణ హైకోర్టు గతంలో ఖేరాకు వారం రోజుల పాటు తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కొంత ఉపశమనం కలిగించింది. అయితే, హైకోర్టు ఇచ్చిన ఆ ఉపశమనంపై సుప్రీంకోర్టు తాజాగా స్టే విధించింది.
స్థానిక కోర్టుకే వెళ్లాలి..
తాజాగా జరిగిన విచారణలో, బెయిల్ కోసం అస్సాంలోని స్థానిక కోర్టుకే వెళ్లాలని సుప్రీంకోర్టు ఖేరాకు సూచించింది. అదే సమయంలో, ఖేరా దాఖలు చేసే పిటిషన్‌ను త్వరితగతిన విచారించాలని అస్సాం కోర్టులను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఇప్పుడు పవన్ ఖేరా తన న్యాయపోరాటాన్ని అస్సాం కోర్టుల్లోనే కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇవి కూడా చదవండి








