డీలిమిటేషన్ అంటే మరో ‘నోట్ల రద్దు’ లాంటిదే: శశిథరూర్
Shashi Tharoor: చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెరగాలని దేశమంతా కోరుకుంటున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై లోక్సభలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డీలిమిటేషన్ ప్రక్రియ మన ప్రజాస్వామ్య సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళల ఆశలను బందీ చేయడమే..
మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా థరూర్ మాట్లాడుతూ.. చట్టసభల్లో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలనే విషయంలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఉన్నాయని, అయితే దీని అమలుకు విధించిన నిబంధనలే అభ్యంతరకరమని అన్నారు. “మహిళలకు ఈ బిల్లును ఒక కానుకగా ఇస్తున్నామని ప్రధాని చెబుతున్నారు.. కానీ దాన్ని డీలిమిటేషన్తో ముడిపెట్టడం ద్వారా ఆ కానుకకు ముళ్లకంచె వేశారు. ఇది మహిళల ఆశలను బందీ చేయడమే” అని ఆయన విమర్శించారు.
రాజకీయ విలువల తగ్గుదల..
నియోజకవర్గాల పునర్విభజనను ఒక సాధారణ పరిపాలనా ప్రక్రియగా చూడలేమని, అది రాజకీయ శక్తి సామర్థ్యాలను మార్చివేస్తుందని థరూర్ అభిప్రాయపడ్డారు. ఈ పరిణామం రాజకీయ విలువల తగ్గుదలకు దారితీస్తుందని ఆయన ఆరోపించారు.
డీలిమిటేషన్లో తొందరపాటు..
నోట్ల రద్దు (డెమానిటైజేషన్) సమయంలో ప్రభుత్వం ఎంత వేగంగా నిర్ణయం తీసుకుందో.. డీలిమిటేషన్ విషయంలో కూడా అంతే తొందరపాటు ప్రదర్శిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో నోట్ల రద్దు దేశాన్ని ఎలా ఇబ్బందుల్లోకి నెట్టిందో, ఇప్పుడు పునర్విభజన కూడా అదే తరహాలో ఒక ‘రాజకీయ నోట్ల రద్దు’ (Political Demonetization) లాంటి నష్టాన్ని కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు.
సమాఖ్య వ్యవస్థకు పునాది అయిన రాష్ట్రాల హక్కులను కాపాడాలని, రాజకీయ అధికార పంపిణీలో అన్యాయం జరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి శశిథరూర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి








