Nitish Kumar: బీహార్‌లో సంచలనం.. నితీశ్ రాజీనామా.. తదుపరి సీఎం ఎవరు?
బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. వరుసగా పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేవలం నాలుగు నెలల్లోనే జేడీయూ (JDU) అధినేత నితీశ్ కుమార్ (Nitish Kumar) తన పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వైపు అడుగులేస్తూ.. గురువారం ఆయన అధికారికంగా రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు.
ఎక్స్‌లో నితీశ్ భావోద్వేగ సందేశం..
నామినేషన్‌కు ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీశ్ (Nitish Kumar).. ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా బీహార్ ప్రజలను ఉద్దేశించి సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశారు. “గత రెండు దశాబ్దాలుగా నాపై అచంచలమైన విశ్వాసం ఉంచి, రాష్ట్రానికి సుదీర్ఘకాలం సేవ చేసే అదృష్టాన్ని కలిగించిన బీహార్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఉభయ సభల (లోక్‌సభ, రాజ్యసభ అలాగే శాసనసభ, శాసనమండలి) సభ్యుడిగా పనిచేయాలన్నది నా చిరకాల ఆకాంక్ష. ఆ కోరికను నెరవేర్చుకునేందుకే ఇప్పుడు రాజ్యసభకు వెళ్తున్నాను. సీఎం పదవి నుంచి తప్పుకున్నా, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, కొత్త ప్రభుత్వానికి నా సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది” అని నితీశ్ (Nitish Kumar) స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
జేడీయూ కార్యకర్తల విధ్వంసం..
నితీశ్ (Nitish Kumar) నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా హాజరై మద్దతు పలికారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీహార్ అభివృద్ధికి నితీశ్ ఎనలేని కృషి చేశారని, ఆయన పాలనాకాలం బీహార్ చరిత్రలోనే స్వర్ణయుగమని అమిత్ షా కొనియాడారు. మరోవైపు నితీశ్ ఆకస్మిక రాజీనామాను జీర్ణించుకోలేని జేడీయూ కార్యకర్తలు పాట్నాలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద భారీ ఆందోళనకు దిగారు. పార్టీ ఆఫీసులోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు, నితీశ్ (Nitish Kumar) కుమారుడు నిశాంత్ కుమార్ పర్యటన కోసం చేసిన విందు ఏర్పాట్లను సైతం నేలమట్టం చేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
మహారాష్ట్ర మోడల్ అన్నాం కదా : విపక్షాలు
నితీశ్ (Nitish Kumar) నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. “ఎన్నికలు ముగిసిన ఆరు నెలల్లోపే నితీశ్‌ను సీఎం సీటు నుంచి దించేసి బీహార్‌లో బీజేపీ ‘మహారాష్ట్ర మోడల్’ అమలు చేస్తుందని మేం ముందే హెచ్చరించాం. ఇప్పుడు అదే నిజమైంది. ఆయన మాతో (ఆర్జేడీ) ఉండి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు” అని మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఎద్దేవా చేశారు. ఇది పూర్తిగా ప్రజాతీర్పును అవమానించడమేనని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ మండిపడ్డారు.
కొత్త సీఎం రేసులో ఉన్నదెవరు?
నితీశ్ (Nitish Kumar) నిష్క్రమణతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత డిప్యూటీ సీఎం, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి పేరు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, జేడీయూ సీనియర్ నేత విజయ్ కుమార్ చౌదరి పేర్లు కూడా సీఎం రేసులో బలంగా వినిపిస్తున్నాయి. రాబోయే ఒకటి, రెండు రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.
ఇవి కూడా చదవండి







