ఆ ఒక్కరి నిష్క్రమణను జీర్ణించుకోలేకపోతున్న కేజ్రీవాల్
ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఆమ్ ఆద్మీని వీడటం ఆ పార్టీని ఒక్క కుదుపు కుదిపేసింది. మిగతా ఆరుగురు పార్టీ నుంచి నిష్క్రమించినా.. ఒక్కరు వెళ్లిపోవడాన్ని మాత్రం కేజ్రీవాల్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అలాగే పార్టీకి కూడా తీవ్రమైన నష్టమేనని అంటున్నారు.రాఘవ్ చద్దా నిష్క్రమించడంతో బహిరంగంగానే పార్టీ నష్టపోతోంది. అయితే.. ఆయనతో పాటు సందీప్ పాఠక్ కూడా ఆప్ కి గుడ్ బై చెప్పేయడం కేజ్రీవాల్ కి అస్సలు మింగుడు పడటమే లేదు. సందీప్ పాఠఘక్ వెళ్లడం ద్వారా ఆప్ సంస్థాగతమైన నిర్మాణం విషయంలో బాగా నష్టపోతోందని అందరూ భావిస్తున్నారు.
పంజాబ్ సక్సెస్ వెనుక మాస్టర్ మైండ్ పాఠక్..
నిజానికి సందీప్ పాఠక్ అస్సలు అందరికీ కనిపించేలా వుండరు. పెద్ద హడావుడీ వుండదు. ఆయన నేరుగా పనిచేయడం కంటే.. తెర వెనుక వుండి పనిచేయడమే ఆయన ఎక్కువ ఇష్టం. పంజాబ్ లో ఆప్ పాగావేడయం వెనుక పాఠక్ మైండ్ వుంది. ఆయనే కీలక పాత్ర పోషించారు. ఆయన్ను పార్టీలో అందరూ ‘‘నిశ్శబ్ద సూత్రధారి’’ అని పిలుచుకుంటారు. అంత లోప్రొఫైల్ గా వుంటూ పార్టీ విస్తరణకు పనిచేశారు.
2022 పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ అధికార పగ్గాలు చేపట్టడం వెనుక సందీప్ పాఠక్ మాస్టర్ మైండ్ వుంది. క్షేత్ర స్థాయిలో పార్టీని పటిష్టం చేయడం వెనుక ఆయన పాత్రే వుంది. ఎప్పటికప్పుడు సర్వేలు చేయడం, ప్రణాళికలు రచించడం, బూత్ స్థాయి వరకూ దృష్టి పెట్టడంతో ఆప్ కి పంజాబ్ పట్టుగొమ్మ అయ్యింది. ఇది ఇప్పటికీ ఆ పార్టీకి అత్యంత ముఖ్యమైన కంచుకోటలలో ఒకటిగా ఉంది.
పాఠక్ కేవలం ఓ ఎంపీ మాత్రమే కాదు, ఆప్ కి, కేజ్రీవాల్ కి అత్యంత సన్నిహితునిగా, కీలక నిర్ణయాలు తీసుకునే బృందంలో సభ్యుడు కూడా. 2022 లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులై, పార్టీలో అత్యున్నత విధాయక నిర్ణాయక మండలి అయిన రాజకీయ వ్యవహారాల కమిటీలో కూడా సభ్యునిగా వుండేవారు.2016 నుంచి ఆప్ లో ఆయన రాజకీయం ప్రారంభమైంది. ఆశీష్ కేతాన్ తో కలిసి ‘‘ఢిల్లీ డైలాగ్ కమిషన్’’ లో పనిచేశారు. ఆ తర్వాత పంజాబ్, గుజరాత్ ఎన్నికల విషయంలో నికచ్చితగా సర్వేలు ఇచ్చి, కేజ్రీవాల్ కి అత్యంత నమ్మకస్తునిగా అయ్యారు.
ఆప్ అధినేత జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఆయన కొందర్ని మాత్రమే కలవడానికి ఇష్టపడేవారు. అందులో సునీతా కేజ్రీవల్, బిభవ్ కుమార్ తో పాటు, అతికొద్ది మందిలో సందీప్ పాఠక్ ఒకరు. అంతలా కేజ్రీవాల్ కి నమ్మకస్తునిగా అయ్యారు.అయితే.. ఇతరుల విషయంలో కేజ్రీవాల్ కాస్త ఊహించినా.. పాఠక్ నిష్క్రమణను మాత్రం అస్సలు ఊహించి వుండరు. రాఘవ్ చద్దాకు, పార్టీ నాయకత్వానికి మధ్య కొంతకాలంగా ఘర్షణ వాతావరణం కనిపిస్తోందని పార్టీ నేతలు పేర్కొన్నారు. అదే విధంగా, స్వాతి మాలివాల్ కూడా నాయకత్వంతో విభేదించారు. దీనికి భిన్నంగా, పాఠక్ పార్టీ కీలక కార్యకలాపాల్లో నిశితంగా పాలుపంచుకుంటూ వచ్చారు. ఆయన తీసుకున్న ఆ ఆకస్మిక నిర్ణయం ఆశ్చర్యం కలిగించడమే కాకుండా, అంతర్గతంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.








