Rahul Gandhi: కేంద్ర మంత్రి పూరిపై రాహుల్ సంచలన ఆరోపణలు..!
దేశంలో నెలకొన్న ఆయిల్, గ్యాస్ సంక్షోభంపై పార్లమెంట్ ఉభయ సభలు తీవ్ర వాడివేడి చర్చలకు వేదికవుతున్నాయి. ఈ క్రమంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరిపై సంచలన ఆరోపణలు చేసి సభలో పెను దుమారం రేపారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల వేళ.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భారత్కు అమెరికా ‘అనుమతి’ ఇవ్వడాన్ని, దానికి కేంద్రం తలొగ్గడాన్ని రాహుల్ తీవ్రస్థాయిలో తప్పుబట్టారు.
అమెరికా అనుమతి తీసుకోవడం ఏంటి?
సభలో రాహుల్ (Rahul Gandhi) మాట్లాడుతూ భారత విదేశాంగ, ఇంధన విధానాలపై సూటి ప్రశ్నలు సంధించారు. “ఒక దేశ పునాదులు కేవలం దాని ఇంధన భద్రతపైనే ఆధారపడి ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎవరి వద్ద చమురు, గ్యాస్ కొనుగోలు చేయాలో నిర్ణయించే హక్కు అమెరికాకు ఎక్కడిది? రష్యా నుంచి ఇంధనం కొనాలా వద్దా అని అమెరికా అనుమతించడానికి భారత ప్రభుత్వం ఎలా అంగీకరిస్తుంది?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
చమురు ఉత్పత్తి దేశాలతో మన సంబంధాలు ఎలా ఉండాలో మనమే స్వతంత్రంగా నిర్ణయించుకోవాలని, అంతటి సార్వభౌమత్వాన్ని ఇతర దేశాలకు తాకట్టు పెట్టడం దారుణమన్నారు. భారత్ లాంటి అతిపెద్ద దేశం.. ఆయిల్ కొనుగోళ్ల కోసం వేరే దేశ అధ్యక్షుడి వద్ద అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని (Rahul Gandhi) ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మంత్రి పూరికి ‘ఎప్స్టీన్’తో సంబంధాలు!
ఈ పరిస్థితికి గల కారణాలను వివరిస్తూ రాహుల్ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు సభను కుదిపేశాయి. “కేంద్ర ఆయిల్ మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజీ పడిపోవడం వల్లే మన ఇంధన కొనుగోలు విధానాన్ని అమెరికా చేతుల్లో పెట్టేశారు. దీనికి ప్రధాన కారణం.. మంత్రి పూరికి వివాదాస్పద ‘జెఫ్రీ ఎప్స్టీన్’తో (Jeffrey Epstein) ఉన్న సంబంధాలే” అంటూ రాహుల్ బాంబు పేల్చారు. ఈ వ్యాఖ్యలతో విపక్ష సభ్యులంతా సభలో ‘ఎప్స్టీన్ ఫైల్స్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. మరోవైపు రాహుల్ (Rahul Gandhi) ఆరోపణలను ఎన్డీయే పక్షాలు తీవ్రంగా ఖండించడంతో సభలో గందరగోళం నెలకొంది.
నిబంధనలు ఉల్లంఘించారన్న స్పీకర్..
రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఈ వ్యక్తిగత, సంచలన ఆరోపణలపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో మాట్లాడేందుకు ఇచ్చిన నోటీసుకు, ఆయన మాట్లాడుతున్న అంశానికి పొంతన లేదంటూ స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “దేశంలో ఎల్పీజీ (LPG) సంక్షోభంపై మాట్లాడేందుకు మాత్రమే మీరు నోటీసు ఇచ్చారు. దానికి నేను అనుమతించాను. కానీ, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత స్థానంలో ఉండి, నోటీసులో లేని ఇతర అంశాలను లేవనెత్తడం పార్లమెంటు నిబంధనలకు విరుద్ధం” అని గుర్తుచేశారు. సభ అనేది రూల్స్ ప్రకారమే నడుస్తుందని రాహుల్కు (Rahul Gandhi) స్పీకర్ ఓం బిర్లా తేల్చిచెప్పారు. మొత్తానికి ఇంధన కొరతపై జరగాల్సిన దేశీయ చర్చ.. అంతర్జాతీయ వివాదాలు, ఆరోపణల వైపు మళ్లడం రాజకీయంగా కాక రేపుతోంది.
ఇవి కూడా చదవండి








