CEC Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై విపక్షాల అభిశంసన నోటీసులు
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై (CEC Gyanesh Kumar) ప్రతిపక్షాలు చారిత్రాత్మక అభిశంసన అస్త్రాన్ని ప్రయోగించాయి. ఆయన పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తూ లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్ష కూటమి అధికారికంగా నోటీసులు అందజేసింది. ఒకే రాజకీయ పార్టీకి లబ్ధి చేకూరేలా ఎన్నికల సంఘం నిర్ణయాలు ఉంటున్నాయని, రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను విస్మరించారని ఆరోపిస్తూ మొత్తం ఆరు ప్రధాన అభియోగాలతో ఈ తీర్మానాన్ని రూపొందించారు.
ముఖ్యంగా బిహార్ సహా పలు కీలక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల రూపకల్పన, సవరణల ప్రక్రియలో సీఈసీ (CEC Gyanesh Kumar) ప్రవర్తన అత్యంత వివాదాస్పదంగా ఉందని ప్రతిపక్షాలు ఈ నోటీసులో ప్రధానంగా ఎత్తిచూపాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ ఈ అభిశంసన తీర్మానానికి నాయకత్వం వహించగా, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సహా ఇతర పక్షాలు దీనికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ కీలక తీర్మానంపై ఉభయ సభలకు చెందిన మొత్తం 193 మంది పార్లమెంటు సభ్యులు సంతకాలు చేయడం దీని తీవ్రతను తెలియజేస్తోంది.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ నోటీసుల నేపథ్యంలో పార్లమెంటరీ రాజ్యాంగ ప్రక్రియ ఎలా సాగనుందనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఉభయ సభల ప్రిసైడింగ్ అధికారులు (లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్) ఈ తీర్మానాన్ని స్వీకరించి, ఓటింగ్ ద్వారా నెగ్గితే.. తదుపరి విచారణ కోసం ఒక అత్యున్నత స్థాయి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) లేదా సుప్రీంకోర్టుకు చెందిన మరో న్యాయమూర్తి, దేశంలోని 25 హైకోర్టుల నుంచి ఒక ప్రధాన న్యాయమూర్తి, అలాగే న్యాయశాస్త్రంలో అపార అనుభవం ఉన్న ఒక నిష్పక్షపాతమైన జ్యూరిస్ట్ సభ్యులుగా ఉంటారు.
విపక్షాలు చేసిన ఈ ఆరు ఆరోపణలపై ఈ అత్యున్నత ప్యానెల్ లోతైన విచారణ జరుపుతుంది. సహజ న్యాయ సూత్రాల ప్రకారం, తనపై వచ్చిన అభియోగాలపై వివరణ ఇచ్చుకునేందుకు, తన వాదనను బలంగా వినిపించేందుకు సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు (CEC Gyanesh Kumar) పూర్తి అవకాశం లభిస్తుంది. ఈ కమిటీ సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించి సమగ్రమైన నివేదికను పార్లమెంటుకు సమర్పించిన తర్వాతే.. సీఈసీ అభిశంసనపై సభలో అధికారికంగా తుది చర్చ ప్రారంభమవుతుంది. దేశ ప్రజాస్వామ్య, ఎన్నికల చరిత్రలో ఈ పరిణామం అత్యంత సంచలనాత్మకంగా మారనుంది.
ఇవి కూడా చదవండి








