LPG Shortage: ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదు.. ముందస్తు బుకింగ్స్ ఆపండి: కేంద్రం
పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ (LPG Shortage) సరఫరాకు అంతరాయం కలుగుతుందన్న వదంతులు ప్రజల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ భయాలతో ప్రజలు ముందస్తుగా గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకుంటుండటంతో డిమాండ్ అకస్మాత్తుగా పెరిగింది. అయితే, ఈ భయాందోళనలపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఎల్పీజీ సరఫరా విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందస్తుగా ‘పానిక్ బుకింగ్స్’ (Panic Bookings) చేయవద్దని విజ్ఞప్తి చేసింది.
శుక్రవారం జరిగిన ఉన్నతస్థాయి పార్లమెంటరీ కమిటీ సమావేశం అనంతరం, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, ఆ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మీడియాతో మాట్లాడుతూ దేశీయ గ్యాస్ నిల్వలపై కీలక విషయాలు వెల్లడించారు. అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తగా దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని (LPG Shortage) ఏకంగా 30 శాతం మేర పెంచామని, కాబట్టి సరఫరా వ్యవస్థకు ఎలాంటి ఢోకా లేదని భరోసా ఇచ్చారు.
ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రజలు అవసరం లేకపోయినా భయంతో ముందస్తుగా సిలిండర్లను బుక్ చేసుకుంటున్నారు. అధికారిక గణాంకాలను పరిశీలిస్తే.. సాధారణ రోజుల్లో దేశవ్యాప్తంగా రోజుకు సగటున 55.7 లక్షల రీఫిల్స్ బుక్ అవుతుండగా, ప్రస్తుత పానిక్ వాతావరణంలో ఆ సంఖ్య అనూహ్యంగా 75.7 లక్షలకు ఎగబాకింది. కేవలం భయం వల్ల పెరిగిన ఈ (LPG Shortage) డిమాండ్ కారణంగా, సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరిగి, నిజంగా అత్యవసరంగా గ్యాస్ కావలసిన సామాన్య వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
బుకింగ్స్ భారీగా పెరిగినప్పటికీ డెలివరీ వ్యవస్థను మరింత వేగవంతం చేశామని, వినియోగదారులు సిలిండర్ బుక్ చేసిన 2.5 రోజుల్లోనే (రెండున్నర రోజులు) వారి ఇళ్లకు డెలివరీ అయ్యేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం హామీ ఇచ్చింది. డెలివరీ సమయంలో ఎలాంటి జాప్యం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి వీలుగా దేశవ్యాప్తంగా వచ్చే 10 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు (LPG Shortage) పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది.
ఇదే అదనుగా భావించి డీలర్లు గానీ, మరెవరైనా అక్రమార్కులు గానీ గ్యాస్ సిలిండర్ల కృత్రిమ కొరత (LPG Shortage) సృష్టించినా.. బ్లాక్ మార్కెట్కు తరలించి నిర్ణీత ధర కంటే ఎక్కువ ధరకు విక్రయించినా ఏమాత్రం ఉపేక్షించేది లేదని కేంద్రం కఠినంగా హెచ్చరించింది. అటువంటి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. పౌరులు వదంతులను నమ్మవద్దని, వాస్తవ అవసరాలకు మాత్రమే బుకింగ్స్ చేసుకోవాలని సూచించింది.








