Nirmala Sitharaman: ఏం చేసినా విమర్శలు తప్పవుగా .. బడ్జెట్ కేటాయింపులపై నిర్మల
కేంద్ర బడ్జెట్ 2026-27 దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, ఉద్యోగాల కల్పన ప్రధాన లక్ష్యంగా రూపొందించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. “సబ్కా సాథ్, సబ్కా వికాస్” స్ఫూర్తితో 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ఈ బడ్జెట్ బలమైన పునాది వేస్తుందని ఆమె స్పష్టం చేశారు. కేవలం కేటాయింపులకే పరిమితం కాకుండా, ఉత్పాదకతను పెంచే నిర్మాణాత్మక సంస్కరణలపై దృష్టి సారించామన్నారు.
ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపులు లేవన్న విమర్శలపై కూడా నిర్మల (Nirmala Sitharaman) స్పందించారు. “ప్రభుత్వం ఏ మార్గంలో వెళ్లినా విమర్శలు తప్పవు” అన్నారు. బడ్జెట్లో ఆరోగ్య రంగానికి పెద్దపీట వేసినట్లు తెలిపిన ఆమె.. ఆరోగ్య మంత్రిత్వ శాఖకు కేటాయింపులను 10 శాతం పెంచి రూ.1.06 లక్షల కోట్లకు చేర్చామన్నారు. బయోఫార్మా రంగానికి రాబోయే ఐదేళ్లలో రూ.10,000 కోట్లు కేటాయించామని, ఇది అంతర్జాతీయంగా భారత్ స్థానాన్ని మెరుగుపరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అలాగే ఆరోగ్య రంగంలో మానవ వనరుల కొరతను తీర్చేందుకు వచ్చే ఐదేళ్లలో లక్ష మంది అనుబంధ ఆరోగ్య నిపుణులను (Allied Health Professionals) తయారు చేయనున్నట్లు నిర్మల (Nirmala Sitharaman) ప్రకటించారు. ఆప్టోమెట్రీ, రేడియాలజీ వంటి విభాగాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు, వృద్ధుల సంరక్షణ కోసం 1.5 లక్షల మంది కేర్గివర్లను సిద్ధం చేస్తామని వెల్లడించారు. రేర్ ఎర్త్ కారిడార్ల ఏర్పాటు కూడా సత్ఫలితాలను ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.






