ప్రపంచ మార్కెట్‌పై భారత్ ‘మెగా’ స్కెచ్.. 10 నెలల్లో 9 అతిపెద్ద ఒప్పందాలు!
ఒకప్పుడు ప్రపంచ దేశాలకు కేవలం అతిపెద్ద వినియోగదారుడిగా మాత్రమే ఉన్న భారతదేశం, ఇప్పుడు గ్లోబల్ ట్రేడ్ (Trade Agreements) సామ్రాజ్యాన్నే శాసించే స్థాయికి ఎదుగుతోంది. కోవిడ్ తర్వాత సరఫరా వ్యవస్థలను పునర్వ్యవస్థీకరిస్తున్న ప్రపంచ దేశాలకు ఇప్పుడు భారత్ ఒక నమ్మకమైన తయారీ, పెట్టుబడి కేంద్రంగా కనిపిస్తోంది. ఈ సువర్ణ అవకాశాన్ని అందిపుచ్చుకుని అంతర్జాతీయ వాణిజ్యంలో మన దేశ స్థానాన్ని సుస్థిరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక బృహత్తర ప్రణాళికను అమలు చేస్తోంది. ముంబైలో జరిగిన ‘సిటీ ఇండియా కాన్ఫరెన్స్’ వేదికగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పిన లెక్కలు చూస్తుంటే.. దేశ ఆర్థిక ముఖచిత్రం ఏ స్థాయిలో మారబోతోందో స్పష్టమవుతోంది.
10 నెలలు.. 9 వాణిజ్య ఒప్పందాలు!
రాబోయే పది నెలల కాలం భారత వాణిజ్య చరిత్రలో అత్యంత కీలకం కాబోతోంది. గత మూడేళ్లుగా కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా కుదుర్చుకున్న ఏకంగా తొమ్మిది ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు’ (Free Trade Agreements – FTAs) రాబోయే 10 నెలల్లోనే పూర్తిస్థాయిలో అమల్లోకి రాబోతున్నాయని మంత్రి గోయల్ సంచలన ప్రకటన చేశారు. ఈ ఒప్పందాల పరిధిలోకి ఏకంగా 38 అభివృద్ధి చెందిన దేశాలు రావడం విశేషం. తాజాగా ఒమన్‌తో ఎఫ్‌టీఏ అమల్లోకి రాగా.. రాబోయే ఆరు నెలల్లోనే మరో రెండు మూడు ప్రధాన దేశాలతో ఈ ఒప్పందాలు కార్యరూపం దాల్చనున్నాయి. అంతేకాదు వచ్చే ఏడాది మరో 3 నుంచి 4 కీలక మెగా ఒప్పందాలు కూడా ఫైనల్ కాబోతున్నాయి. ఈ దేశాలతో జరిగే వాణిజ్యం మన దేశీయ వ్యాపారులను దెబ్బతీసేలా కాకుండా, మన ఆర్థిక వృద్ధికి వెన్నుదన్నుగా నిలిచేలా అత్యంత చాకచక్యంగా డిజైన్ చేశామని ఆయన వివరించారు.
మౌలిక సదుపాయాలపై లక్షల కోట్ల వర్షం..
విదేశీ పెట్టుబడులకు (Trade Agreements) రెడ్ కార్పెట్ వేయడమే లక్ష్యంగా కేంద్రం మౌలిక సదుపాయాలపై కనీవినీ ఎరుగని స్థాయిలో ఖర్చు చేస్తోంది. గ్లోబల్ కంపెనీలను ఆకర్షించేందుకు దేశవ్యాప్తంగా కొత్తగా 100 ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా రూ. 33,500 కోట్ల (3.5 బిలియన్ డాలర్లు) బడ్జెట్‌ను సిద్ధం చేసింది. దీనికి తోడు జాతీయ రహదారులు, ఓడరేవులు, ప్రపంచ స్థాయి విమానాశ్రయాల నిర్మాణాల కోసం ఏకంగా రూ. 12.43 లక్షల కోట్లతో (130 బిలియన్ డాలర్లు) అతిపెద్ద మౌలిక ప్రాజెక్టులు శరవేగంగా నడుస్తున్నాయి.
విశాలమైన దేశీయ మార్కెట్, నైపుణ్యం కలిగిన యువత, అత్యుత్తమ సాంకేతిక సామర్థ్యం, పారదర్శకమైన విధానాలే (Trade Agreements) ఇప్పుడు భారత్‌కు ప్రధాన బలాలుగా మారాయని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఈ బలంతోనే రాబోయే రెండు దశాబ్దాల పాటు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏకైక ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ రికార్డు సృష్టించడం ఖాయమని ఆయన గట్టి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మంత్రి చెప్పిన ఈ మెగా ప్లాన్ అనుకున్నట్లు అమలైతే, గ్లోబల్ ట్రేడ్‌లో ఇండియా రూలింగ్ మొదలైనట్లే!








