బెంగాల్ లో పోలింగ్ సమయంలో ఎక్కడెక్కడ హింసాత్మక ఘర్షణలు జరిగాయంటే…
తమిళనాడు, బెంగాల్ పోలింగ్ ముగిసింది. ఇరు రాష్ట్రాల్లోనూ బంపర్ పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. బెంగాల్ లో 89.93 శాతం పోలింగ్ నమోదవ్వగా..తమిళనాడులో 82.24 శాతం నమోదైంది. అయితే.. బెంగాల్ లో మాత్రం చాలా చోట్ల హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ముఖ్యంగా అసన్ సోల్, మాల్దా, కూచ్ బెహార్, సిలిగురి, ముర్షిదాబాద్ తో సహా పలు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. కొన్ని చోట్ల అభ్యర్థులను ముట్టడించి, వెంబడించి, దాడి చేస్తే, మరికొన్ని చోట్ల పోలీసులు లాఠీ ఛార్జీలు, ఇంకొన్ని చోట్ల ఇటుకలు, రాళ్లతో దాడులు.. జరిగాయి. ఏయే ప్రాంతాల్లో ఎలాంటి ఘర్షణలు జరిగాయో పరిశీలిద్దాం.
అసన్సోల్ :
ఈ ప్రాంతంలో బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ కారుపై దుండగులు దాడి చేశారు. పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు తాము పలు పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తున్న సమయంలో బర్న్‌పూర్‌లోని రహమత్‌నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆమె వాహనంపై దుండగులు పెద్ద రాయి విసిరారు. దీంతో అద్దాలు ధ్వంసమయ్యాయి.
2. కేశ్ పూర్ లో మహిళ మృతి :
బెంగాల్ లోని కేశ్ పూర్ లో ఓ మహిళ తన ఓటు హక్కు వినియోగించుకున్న కాసేపటికే పోలింగ్ కేంద్రం ముందు ప్రాణాలు కోల్పోయింది. మహిళను ఇష్రతన్ బీబీ (55)గా గుర్తించారు. పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని కేశ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న దీఘా ప్రాంతవాసి.
3.ముర్షిదాబాద్ :
ఈ ప్రాంతంలో హుమాయున్ కబీర్, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. ఏజేయూపీ అధినేత, రెజినగర్ అభ్యర్థి హుమాయున్ కబీర్ ఓ సంఘటనా స్థలాన్ని సందర్శించడానికి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇది కాస్త హింసాత్మక ఘర్షణకు దారి తీసింది. సంఘటనా స్థలంలో ఉన్న పోలీసు సిబ్బందికి, హుమాయున్ కబీర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదాలు, ఘర్షణలు జరుగుతున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి.దుండగుల భారీ గుంపు అకస్మాత్తుగా హుమాయున్ కబీర్ కారును చుట్టుముట్టింది. కర్రలు, లాఠీలు, ఇటుకలతో దాడి చేశారు.
4. మాల్దాలో :
మాల్దాలో టీఎంసీలోని ఇరు వర్గాలకే ఘర్షణ జరిగింది. మాల్దా జిల్లాలోని హరీష్ చంద్రపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఎంసీకి చెందిన రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. తాజ్ ముల్ హుస్సేన్ అనే నేత ప్రచార కార్యాలయాన్ని ఆ పార్టీ వారే ధ్వంసం చేశారు.
5. హరీష్ చంద్రపూర్ :
హరీష్చంద్రపూర్-I బ్లాక్ పంచాయతీ సమితి పరిధిలో, మంత్రి తజముల్ హుస్సేన్ మరియు ఆయన మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా బహిరంగంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ, TMC నాయకుడు స్వపన్ అలీ సంచలన ఆరోపణలు చేశారు.మంత్రి ప్రత్యక్ష ఆదేశాల మేరకు పనిచేస్తూ, ఆయన మద్దతుదారులు కాంగ్రెస్ కార్యకర్తలతో చేతులు కలిపి TMC శిబిర కార్యాలయంపై దాడి చేశారని, పార్టీ జెండాలను చింపివేసి, బ్యానర్లను ధ్వంసం చేశారని స్వపన్ అలీ ఆరోపించారు.
ఇవి కూడా చదవండి
6. సిలిగురిలో…
సిలిగురిలో కూడా ఘర్షణ జరిగింది.పోలింగ్ కేంద్రం బయట టీఎంసీ కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు అకస్మాత్తుగా ఘర్షణ చెలరేగింది. క్షణాల్లోనే ఈ వివాదం ముదిరి, ఇరు వర్గాల మధ్య తోపులాట, ఘర్షణకు దారితీసింది.ఈ ఘటన జరిగిన సమయంలో, బీజేపీ అభ్యర్థి శంకర్ ఘోష్ కూడా ఆ ప్రదేశంలోనే ఉన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద విధుల కోసం మోహరించిన కేంద్ర సాయుధ పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి.
7. మాల్దాలో..
ఈవీఎంలు పనిచేయడం లేదని మాల్తాలోని మోథాబారి నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. సమస్యను పరిష్కరించడంలో జాప్యం కావడంతో ఆగ్రహించిన ఓటర్లు.. ఆ అధికారిని చుట్టుముట్టారు. పలువురు ఓటర్లు సెక్టార్ అధికారిని చేయి పట్టుకుని లాగడం, ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించారు.
8. కూచ్ బెహార్ లో :
కూచ్ బెహార్‌లోని తుఫాన్‌గంజ్ ప్రాంతంలో పోలింగ్ జరుగుతున్న సమయంలో భారీ సంఖ్యలో జనం గుమిగూడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి అదుపు తెచ్చేందుకు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. లాఠీఛార్జి నిర్వహించారు.
9. దక్షిణ దినాజ్ పూర్ :
ఈ ప్రాంతంలోని కుమార్ గంజ్ అసెంబ్లీ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి సువేందు సర్కార్‌పై తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు దాడి చేశారు.’బూత్ జామింగ్’ జరుగుతోందని సువేందు సర్కార్‌కు సమాచారం రావడంతో, అక్కడికి చేరుకున్న సుబేందు సర్కార్ పై కర్రలతో భౌతిక దాడికి దిగారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగిందని ఆరోపిస్తున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
10. బీర్భూమ్ లో :
బీర్భూమ్ లో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై రాళ్లదాడి జరిగింది. దుబ్రాజ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బుధ్‌పూర్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన 65వ నంబర్ పోలింగ్ కేంద్రం వద్ద, ఆగ్రహించిన ఓటర్లు CRPF సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. పోలింగ్ యంత్రం పనిచేయకపోవడంతో స్థానికులకు, భద్రతా బలగాలకు మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగిందని అంటున్నారు.
11. జమూరియా :
జమురియా ప్రాంతంలో ఈవీఎంలపై వివాదం రేగింది. శ్రీపూర్ ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉన్న వుంచిన ఓ వాహనంలో ఈవీఎంలు లభ్యమయ్యాయన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఎలాంటి భద్రతా సిబ్బంది కూడా లేరని స్థానికులు, విపక్షాలు ఆరోపించాయి.
ఇవి కూడా చదవండి








