చరిత్ర సృష్టించిన హరివంశ్… తిరిగి మూడోసారి డిప్యూటీ చైర్మన్ గా
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ్ సింగ్ తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రతిపక్షాలు ఈ పదవికి ఎవ్వర్నీ బరిలోకి దింపకపోవడంతో హరివంశ్ తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హరివంశ్ కి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి దక్కడం ఇది వరుసగా మూడోసారి. దీంతో ఆయన చరిత్రను సృష్టించారు.
ఏప్రిల్ 9 నాటికి పదవీకాలం ముగిసింది. దీంతో ఆ పదవి ఖాళీ అయ్యింది. రాజ్యసభ నిబంధనల ప్రకారం అంటే నియమం 7 ప్రకారం ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఎన్నికను ప్రకటించారు. ఎవరైనా తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలనుకుంటే గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు అవకాశముంటుందని అందులో పేర్కొన్నారు. అయితే ఏ పక్షం కూడా ఈ పదవికి అభ్యర్థిని ప్రకటించలేదు. కేవలం అధికార ఎన్డీయే కూటమి నుంచి మాత్రమే హరివంశ్ పేరును నామినేట్ చేస్తూ ప్రతిపాదనలు అందాయి. దీంతో హరివంశ్ తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రాజ్యసభ సభా నాయకుడు జె.పి. నడ్డా, హరివంశ్ పేరును ప్రతిపాదిస్తూ మొదటి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, ఎంపీ ఎస్. ఫాంగ్నోన్ కోన్యాక్ దానిని బలపరిచారు. మొత్తంగా, హరివంశ్ మద్దతుగా రాజ్యసభ సచివాలయానికి ఐదు ప్రతిపాదనలు అందాయి; వీటిలో సీనియర్ బీజేపీ నాయకులు సమర్పించిన ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.ప్రతిపక్ష పార్టీలు ఎటువంటి అభ్యర్థులను బరిలోకి దింపకుండా ఎన్నికలను బహిష్కరించడంతో, ఎన్నికల ప్రక్రియ ఎటువంటి పోటీ లేకుండానే ముగిసింది.
మాజీ ప్రధాని చంద్రశేఖర్ కి మీడియా సలహదారుగా….
హరివంశ్ నారాయణ్ సింగ్ కుటుంబం వ్యవసాయ కుటుంబం. అర్ధశాస్త్రం నుంచి ఆయన పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. 1980 ప్రాంతంలో ‘‘ధర్మ యుగ్’’ అన్న పత్రిక నుంచి ఆయన పాత్రికేయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు. అది నచ్చక, తిరిగి పాత్రికేయునిగా చేరారు. ఆ తర్వాత 1989 లో ప్రభాత్ ఖబర్ అన్న పత్రికలో చేరారు. అందులో సంపాదకత్వ బాధ్యతలు చేపట్టారు. 2014 లో జేడీయూ నుంచి గెలుపొందిన తర్వాత సంపాదకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
ఇవి కూడా చదవండి
మాజీ ప్రధాని చంద్రశేఖర్ కి మీడియా సలహాదారుగా పనిచేశారు. ప్రధానంగా ఈయన పాత్రికేయుడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. రాజ్యసభలో అందరూ మేధావులే వుంటారు. వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు వుంటారు. పైగా ఇది పెద్దల సభ. దీంతో అత్యంత సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం వుంటుంది.
సభలో హరివంశ్ అత్యంత సంయమనం, సమన్వయం చేస్తారన్న పేరు సంపాదించుకున్నారు. దీంతో అన్ని పార్టీలూ ఆయన్ను గౌరవిస్తాయి.
అయితే కాంగ్రెస్ ఎందుకు బహిష్కరించింది…?
ఇండియా కూటమి ఈ ఎన్నికలను బహిష్కరించింది. అయితే హరివంశ పై తమకు అపారమైన గౌరవం వుందని ప్రభుత్వానికి పార్లమెంటరీ సంప్రదాయాలపై నమ్మకం లేదని, అందుకే బహిష్కరిస్తున్నామని జైరాం రమేష్ ప్రకటించారు. లోక్ సభలో ఉప సభాపతి పదవి ఇంకా ఖాళీగానే వుందని, ఇది పార్లమెంటరీ సంప్రదాయానికి విరుద్ధమని మండిపడ్డారు. అంతేకాకుండా, హరివంశ్ పదవీకాలం ముగిసిన కేవలం ఒక్క రోజులోనే ఆయన నామినేషన్ దాఖలు చేయడం గతంలో ఎన్నడూ జరగని పరిణామమని, ప్రభుత్వం తమతో సంప్రదించలేదని మండిపడ్డారు.
శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
ఈ సందర్భంగా ప్రధాని మోదీ డిప్యూటీ చైర్మన్కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అనుభవం రాజ్యసభకు ఎంతో అవసరమని అన్నారు. ఆయన అందరినీ కలుపుకుని వెళ్లాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. హరివంశ్ నేతృత్వంలో సభ మరింత శక్తిమంతం అవుతుందని అన్నారు. రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా నూతన ఉపసభాపతికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రతిపక్షానికి కూడా తగిన ప్రాధాన్యం ఇస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు.
ఇవి కూడా చదవండి








