నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
దేశంలో ఎన్నికల నగారా మోగనుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం పుదుచ్చేరి రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు సాయంత్రం షెడ్యూల్ను విడుదల చేయనుంది. ఇందుకోసం ఆదివారం సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఈసీ పూర్తిస్థాయి పోలింగ్ తేదీలను ప్రకటించనుంది. ఈ ఐదు రాష్ట్రాల శాసనసభల పదవీకాలం మే జూన్ నెలల్లో ముగియనుండటంతో ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయి తుది జాబితాలు కూడా విడుదలయ్యాయి. షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు అస్సాం రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో పట్టు సాధించాలని BJP ప్రయత్నిస్తుండగా తమిళనాడులో అన్నాడీఎంకేతో కలిసి బరిలోకి దిగుతోంది. సాయంత్రం షెడ్యూల్ విడుదలైన వెంటనే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది.








