మళ్లీ తెరపైకి డీకే- కుమార స్వామి వివాదం..
కేంద్ర మంత్రి కుమార స్వామి, ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య మళ్లీ పొలిటికల్ వార్ ప్రారంభమైంది. కర్నాటక రాజకీయాల్లో వీరిద్దరి మధ్యా వైరం చాలా కాలంగా కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికీ అది నడుస్తూనే వుంది.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డీకే శివకుమార్ అన్ని పార్టీల సీనియర్లను కలుస్తూ వస్తున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం యడియూరప్పతో సహా.. వివిధ పార్టీలకు చెందిన రాజకీయ దిగ్గజాలను కలిశారు. ఇది చాల పద్ధతిగా రూపకల్పన చేశారు. ఇదే క్రమంలో కుమార స్వామిని కూడా కలుస్తారని అందరూ అనుకున్నారు.
అయితే.. దీనిపై కుమార స్వామి ఘాటుగా స్పందించారు. అలాంటి సమావేశమేమీ జరగదని కొట్టిపారేశారు.పరిపాలన విషయంలో తన సలహా తీసుకుంటానని శివకుమార్ చేసిన సూచనను ఎగతాళి చేయడంతో పాటు, బీజేపీ మరియు జేడీ(ఎస్) మధ్య చిచ్చు పెట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. “నేను అతనికి ఎలాంటి సలహా ఇవ్వగలను? ముఖ్యమంత్రిగా నేను ఏం సాధించానని అతను పదే పదే అడిగాడు. అతను నన్ను కలవడానికి వస్తున్నాడంటే, అది కేవలం ఫోటోల కోసమే. అంతకు మించి అందులో ఏమీ లేదు,” అని కుమారస్వామి అన్నారు.
అంతేకాకుండా ‘‘అతి వినయం ధూర్త లక్షణం’’ అంటూ కుమార స్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు.మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడకు మరోసారి రాజ్యసభ సభ్యత్వం కల్పించకపోవడంపై తలెత్తిన వివాదం కారణంగా అధికార కాంగ్రెస్ మరియు బీజేపీ-జేడీ(ఎస్) కూటమి మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.








