Delhi Crime: డెలివరీ బాయ్స్ కిరాతకం.. వ్యాపారిపై హెల్మెట్లతో విచక్షణారహిత దాడి!
Delhi Crime: దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత కీలకమైన కనాట్ ప్లేస్ ప్రాంతంలో ఒక వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. కేవలం చిన్నపాటి వాగ్వాదం కారణంగా ముగ్గురు ఫుడ్ డెలివరీ ఏజెంట్లు కలిసి శివమ్ గుప్తా (36) అనే వ్యక్తిని హెల్మెట్లతో కొట్టి చంపడం స్థానికంగా కలకలం రేపింది.
అసలేం జరిగింది?
పోలీసుల కథనం ప్రకారం.. జనవరి 3వ తేదీ రాత్రి శివమ్ గుప్తాకు, ముగ్గురు డెలివరీ బాయ్స్‌కు మధ్య ఏదో విషయంలో గొడవ మొదలైంది. ఇది కాస్తా ముదిరి ఆగ్రహంతో ఊగిపోయిన నిందితులు, తమ వద్ద ఉన్న హెల్మెట్లతో శివమ్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, మృత్యువుతో 16 రోజుల పాటు పోరాడిన శివమ్, చివరకు జనవరి 19న ప్రాణాలు విడిచారు.
కుటుంబంలో విషాదం:
మరణించిన శివమ్ గుప్తా పహాడ్‌గంజ్ ప్రాంతానికి చెందిన వ్యాపారి అనిల్ కాంత్ గుప్తాకు ఒక్కగానొక్క కుమారుడు. తన చేతికందిన కొడుకు ఇలా అకారణంగా హత్యకు గురవడంతో ఆ తండ్రి కన్నీరుమున్నీరవుతున్నారు. “నా కుమారుడే నాకు సర్వస్వం, మాకు న్యాయం జరగాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసుల చర్యలు:
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా, పరారీలో ఉన్న మూడవ వ్యక్తి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. రాజధాని నడిబొడ్డున ఇలాంటి ఘటన జరగడం పట్ల నగరవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.






