Rahul Gandhi: చైనీస్ సీసీటీవీల నిషేధం మోదీ సర్కార్ కప్పిపుచ్చుకునే చర్యే: రాహుల్ గాంధీ
కేంద్ర ప్రభుత్వం ఇటీవల చైనాకు చెందిన సీసీటీవీ కెమెరాలను నిషేధించడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నిషేధం వెనుక దేశ భద్రతపై చిత్తశుద్ధి కంటే, మోదీ ప్రభుత్వం తమ వైఫల్యాలను, తప్పులను కప్పిపుచ్చుకునే కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. విదేశీ నిఘా ముప్పును స్వయంగా ప్రభుత్వమే దేశంలోకి ఆహ్వానించిందని విమర్శించారు.
ప్రభుత్వ భవనాల్లో అవే కెమెరాలు!
దేశ రాజధాని సహా దేశవ్యాప్తంగా అత్యంత కీలకమైన, సున్నితమైన ప్రాంతాల్లో ఏళ్ల తరబడి చైనాకు చెందిన సీసీటీవీ కెమెరాలను ఎందుకు అనుమతించారని రాహుల్ (Rahul Gandhi) ప్రశ్నించారు. ఈ కెమెరాల ద్వారా భారతీయుల కదలికలు, సున్నితమైన సమాచారం విదేశీ నిఘా (Foreign Surveillance) సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయిందని, పౌరులను తీవ్రమైన రిస్క్‌లోకి నెట్టేశారని ఆందోళన వ్యక్తం చేశారు. జరిగిన నష్టాన్ని ప్రజలు గ్రహించకముందే నిజాలను దాచేందుకే ఇప్పుడు హడావుడిగా ఈ నిషేధాస్త్రం ప్రయోగించారని విమర్శించారు. ఒకవైపు సామాన్య ప్రజలు చైనీస్ కెమెరాలు వాడకూడదని ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వమే.. విడ్డూరంగా తమ ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల్లో మాత్రం నేటికీ అవే చైనా కెమెరాలను వినియోగిస్తుండటం కేంద్రం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.
చైనా యాప్స్.. ఏఐతో డేటా లీక్
కేవలం సీసీటీవీల విషయమే కాకుండా దేశ డిజిటల్ భద్రత పైనా రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆందోళన వ్యక్తంచేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నిషేధించిన పలు చైనా మొబైల్ యాప్‌లు ఇప్పుడు సరికొత్త పేర్లతో, రూపాలతో తిరిగి భారత మార్కెట్లోకి ప్రవేశించి యథేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఆరోపించారు. దీనికి తోడు, విదేశాలకు చెందిన కృత్రిమ మేధ (ఏఐ – AI) ప్లాట్‌ఫామ్‌లు భారతదేశానికి చెందిన అత్యంత సున్నితమైన, వ్యక్తిగత డేటాను విచ్చలవిడిగా ప్రాసెస్ చేస్తున్నాయని.. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం, భద్రతా ఏజెన్సీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఈ డేటా చౌర్యంపై ప్రభుత్వం కనీస స్పందించకపోవడం దారుణమన్నారు.
దాటవేసిన ఐటీ శాఖ
దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతున్న ఈ తీవ్రమైన అంశంపై తాను స్వయంగా పార్లమెంటు వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశానని రాహుల్ గాంధీ (Rahul Gandhi) గుర్తుచేశారు. కానీ కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ (IT Ministry) నుంచి కనీస బాధ్యతాయుతమైన సమాధానం రాలేదని పెదవి విరిచారు. ప్రజలకు అసలు వాస్తవాలు చెప్పకుండా, కేవలం వట్టి మాటలతో, బుకాయింపులతో ఐటీ శాఖ దాటవేత ధోరణి ప్రదర్శించిందని విమర్శించారు. జాతీయ భద్రత విషయంలో పారదర్శకత లోపించిందని, మోదీ ప్రభుత్వం వాస్తవాలను దాస్తూ దేశ సార్వభౌమాధికారంతో రాజీ పడుతోందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు.








