Summer: సమ్మర్ లో కొబ్బరి నీళ్ళు లేదా మజ్జిగ, ఏది బెటర్..?
వేసవి(Summer) వచ్చిందంటే చాలు.. చాలా మంది కొబ్బరి నీళ్ళు లేదా మజ్జిగ తాగడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరి అసలు ఈ రెండిట్లో ఏది మంచిదో ఒకసారి చూద్దాం. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి కొబ్బరి నీళ్లు, మజ్జిగ రెండు కూడా అమృతంతో సమానమే. అయితే, వీటిలో ఏది ఎప్పుడు తాగాలి అనేది మీ శరీర అవసరాలను బట్టి ఉంటుంది. కొబ్బరి నీళ్లలో (Coconut Water) ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఎండలో తిరగడం వల్ల శరీరం కోల్పోయిన లవణాలను ఇది వెంటనే భర్తీ చేస్తుంది.
ఇందులో సహజ సిద్ధమైన చక్కెర ఉంటుంది. అలసిపోయిన శరీరానికి వెంటనే ఎనర్జీ ఇచ్చే అవకాశం ఉంటుంది. కొబ్బరి నీళ్ళు శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. ఉదయం ఖాళీ కడుపుతో లేదా ఎండలో బయటకు వెళ్లినప్పుడు తాగడం చాలా మంచిది. ఇక మజ్జిగ(Butter Milk) విషయానికి వస్తే, శరీర ఉష్ణోగ్రతను తగ్గించి లోపల చల్లగా ఉంచడంలో మజ్జిగ నంబర్ వన్. ఇందులో ఉండే ‘ప్రోబయోటిక్స్’ (మంచి బ్యాక్టీరియా) జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. వేసవిలో వచ్చే కడుపు ఉబ్బరం, అసిడిటీని తగ్గిస్తుంది.
ఇవి కూడా చదవండి
ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కొద్దిగా ఉప్పు, అల్లం, కొత్తిమీర కలిపితే మరింత రుచిగా, ఆరోగ్యంగా ఉంటాయి. భోజనం తర్వాత లేదా మధ్యాహ్నం వేళలో తాగడం ఉత్తమం. మీరు డీహైడ్రేషన్ తో బాధపడుతుంటే కొబ్బరి నీళ్లు బెస్ట్ ఛాయిస్. మీరు శరీరంలో వేడిని తగ్గించుకోవడానికి లేదా జీర్ణ సమస్యలు లేకుండా ఉండాలని కోరుకుంటే మజ్జిగ అద్భుతంగా పనిచేస్తుంది. వీలైతే రోజూ ఒకసారి కొబ్బరి నీళ్లు, మరోసారి మజ్జిగ తాగడం వల్ల వేసవిలో ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే, డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగేముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.








