Donald Trump: యుద్ధంతో ట్రంప్ పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యి: మాజీ సీఐఏ చీఫ్
Donald Trump: అణ్వాయుధాల తయారీని అడ్డుకొనే నెపంతో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధం ఇప్పుడు ఒక క్లిష్ట దశకు చేరుకుంది. మూడు వారాలు గడిచినా యుద్ధం ముగిసే సూచనలు కనిపించకపోగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి “ముందు నుయ్యి.. వెనక గొయ్యి”లా తయారైందని అమెరికా మాజీ రక్షణ మంత్రి, సీఐఏ మాజీ అధిపతి లియోన్ పనెట్టా తీవ్ర విమర్శలు చేశారు.
లియోన్ పనెట్టా విశ్లేషణ:
ట్రంప్ స్వయంకృతమే ఈ సంక్షోభం: ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభానికి అధ్యక్షుడు ట్రంపే బాధ్యుడని పనెట్టా పేర్కొన్నారు. ఇరాన్‌పై యుద్ధానికి వెళ్తే ప్రపంచానికి ఎలాంటి ముప్పు ఉంటుందో అమెరికా యంత్రాంగానికి ముందే తెలుసని, ముఖ్యంగా వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేయడం ద్వారా ఇరాన్ ప్రపంచ ఇంధన రవాణాను స్తంభింపజేస్తుందని తెలిసినా, ట్రంప్ ఆ ప్రమాదాన్ని నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు.
ఇవి కూడా చదవండి
తప్పుడు అంచనాలు – ఒంటరైన అమెరికా: ఇరాన్ ప్రతిస్పందనను ట్రంప్ తక్కువగా అంచనా వేశారని పనెట్టా అభిప్రాయపడ్డారు. యుద్ధం త్వరగా ముగుస్తుందని భావించినా, అది ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో నాటో (NATO) దేశాలను ‘కాగితపు పులి’ అని హేళన చేసిన ట్రంప్‌కు, ఇప్పుడు యుద్ధంలో ఆ దేశాల నుంచి ఎలాంటి మద్దతు లభించడం లేదని, ఆయన అంతర్జాతీయంగా ఒంటరి అయ్యారని విమర్శించారు.

బలపడిన ఇరాన్ – మొజ్తాబా ఖమేనీ రాక: ట్రంప్ యంత్రాంగం అనుకున్నట్టుగా ఇరాన్ బలహీనపడలేదని, పైగా తన తండ్రి కంటే కఠినంగా వ్యవహరించే మొజ్తాబా ఖమేనీ నాయకత్వంలో ఆ దేశం మరింత పటిష్టమైందని హెచ్చరించారు.
క్లిష్టమైన సవాలు: యుద్ధాన్ని ఇప్పుడు అర్ధంతరంగా ముగించినా అది వైఫల్యంగా మారుతుందని, కొనసాగిస్తే సంక్షోభం మరింత ముదురుతుందని పనెట్టా విశ్లేషించారు. మిత్రదేశాలను సంప్రదించకుండా యుద్ధానికి దిగడం ట్రంప్ చేసిన అతిపెద్ద తప్పు అని ఆయన స్పష్టం చేశారు.
యుద్ధం ఎంతకాలం కొనసాగితే ట్రంప్‌కు అంత క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయని, ఈ మొత్తం వ్యవహారానికి ఆయన తప్ప ఇంకెవరూ బాధ్యులు కారని పనెట్టా అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ కుండబద్దలు కొట్టారు.








