మాల్దీవులు వెళ్తున్నారా..? ఇవి తెలుసుకోవాల్సిందే..!
మాల్దీవులకు వెళ్లే భారత పౌరులకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆ దేశంలో మాదకద్రవ్యాల నిరోధక చట్టాలను అత్యంత కఠినతరం చేసిన నేపథ్యంలో, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వేసవి సెలవుల సీజన్ కావడంతో మాల్దీవుల పర్యటనకు ప్లాన్ చేసుకునే వారు కొన్ని విషయాలను గమనించాలని స్పష్టం చేసింది.
మాల్దీవుల ప్రభుత్వం ఇటీవల తన డ్రగ్స్ చట్టాలకు సవరణలు చేసిందని, ఇవి 2026 మార్చి నుంచి అమల్లోకి వచ్చాయని ఎన్సీబీ తెలిపింది. ఈ కొత్త చట్టాల ప్రకారం, మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలకు పాల్పడితే జీవిత ఖైదు, భారీ స్థాయిలో డ్రగ్స్ రవాణా చేస్తే కోర్టు అనుమతితో మరణ శిక్ష కూడా విధించే అవకాశం ఉందని వివరించింది. స్వల్ప పరిమాణంలో డ్రగ్స్ దొరికినా కఠిన శిక్షలు తప్పవని పేర్కొంది.
ఇవి కూడా చదవండి
ఇటీవల కాలంలో కొందరు భారత పౌరులతో సహా పలువురు విదేశీయులు డ్రగ్స్ కేసుల్లో మాల్దీవుల్లో అరెస్ట్ అయిన ఘటనలు చోటుచేసుకున్నాయని ఎన్సీబీ గుర్తుచేసింది. ఈ నేపథ్యంలోనే మాలేలోని భారత హైకమిషన్ కూడా స్థానిక చట్టాలను గౌరవించాలని ఇప్పటికే సూచించింది.
“ఈ పరిస్థితుల దృష్ట్యా, భారత పౌరులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులు ఇచ్చే ప్యాకెట్లు, లగేజీలు లేదా వస్తువులను, వాటిలో ఏముందో కచ్చితంగా తెలియకుండా తీసుకెళ్లవద్దు. విమానాశ్రయాలు, పోర్టులలో తెలియని వ్యక్తులు ఏవైనా వస్తువులు తీసుకెళ్లమని అడిగితే అత్యంత జాగ్రత్తగా ఉండాలి” అని ఎన్సీబీ తన ప్రకటనలో పేర్కొంది. చట్టం తెలియదనే వాదన కోర్టులో చెల్లదని, కాబట్టి ప్రయాణికులు తమ లగేజీ విషయంలో పూర్తి జాగ్రత్త వహించాలని సూచించింది. ఎవరైనా అనుమానాస్పదంగా సంప్రదిస్తే జాతీయ నార్కోటిక్స్ హెల్ప్‌లైన్ నంబర్ ‘1933’కు సమాచారం ఇవ్వాలని కోరింది.
ఇవి కూడా చదవండి








