PM Modi: మాల్దీవులతో కీలక ఒప్పందాలు చేసుకున్న మోడీ.. ఫ్రీ ట్రేడ్‌పై చర్చలు

యూకే పర్యటన ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) శుక్రవారం మాల్దీవుల రాజధాని మాలె చేరుకున్నారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమద్ ముయిజ్జు (President Mohamed Muizzu) స్వయంగా మోడీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాల్దీవుల రక్షణ శాఖ భవనంపై ప్రధాని మోడీ భారీ చిత్రాన్ని ఏర్పాటు చేశారు. అద్దు నగరంలో భారీ రోడ్లు, డ్రైనేజీ ప్రాజెక్టులను మోడీ, ముయిజ్జు కలిసి ప్రారంభించారు. అనంతరం ఇరు దేశాల ప్రతినిధుల మధ్య డెలిగేషన్ స్థాయి చర్చలు జరిగాయి. మాల్దీవుల (Maldives) రక్షణ విభాగానికి 72 భారీ వాహనాలను అందజేయాలని, ఆ దేశానికి ఇచ్చే రుణ పరిమితిని ₹4850 కోట్లకు పెంచాలని భారత్ నిర్ణయించింది. వీటితో పాటు పలు కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యంపై చర్చలు ప్రారంభమైనట్లు ప్రధాని మోడీ (PM Modi) ప్రకటించారు.
భారత్, మాల్దీవుల మధ్య 60 ఏళ్ల దౌత్య సంబంధాలను పురస్కరించుకున్న మోడీ (PM Modi).. ఇరు దేశాల బంధాలు చరిత్రకన్నా పాతవి, సముద్రం కన్నా లోతైనవి అని కొనియాడారు. ఈ సందర్భంగా 60 ఏళ్ల దౌత్య బంధాలకు గుర్తుగా ఒక స్టాంపును కూడా విడుదల చేశారు. భారత ప్రధానిగా అత్యధిక కాలం పనిచేసిన రెండో వ్యక్తిగా మోడీ రికార్డు నెలకొల్పిన సందర్భంగా ఆయనకు ముయిజ్జు (President Mohamed Muizzu) శుభాకాంక్షలు తెలిపారు. శనివారం జరిగే మాల్దీవుల 60వ స్వాతంత్ర్య వేడుకలకు మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.