Sajjanar Vs RS Praveen Kumar: సజ్జనార్ నోటీసులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిప్లై ఇస్తారా?
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రస్తుత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మధ్య వివాదం ఆసక్తి రేపుతోంది. తెలంగాణ రాజకీయ, అధికార వర్గాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకప్పుడు సహోద్యోగులుగా ఉన్న వీరిద్దరి మధ్య ఇప్పుడు నోటీసులు ఇచ్చుకునే స్థాయికి వివాదం చేరడం గమనార్హం. ఈ వివాదం ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చుట్టూ తిరుగుతోంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ సిట్‌కు నేతృత్వం వహిస్తున్న వీసీ సజ్జనార్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు.
జనవరి 23న మీడియాతో మాట్లాడిన ప్రవీణ్ కుమార్, సజ్జనార్‌పై గతంలోనే ఏడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని సంచలన ఆరోపణలు చేశారు. నిందితుడిగా ఉన్న వ్యక్తి దర్యాప్తు అధికారిగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. సజ్జనార్‌పై విచారణ జరిపేందుకు మరో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న సజ్జనార్, వెంటనే స్పందించారు. ఆయనకు లీగల్ నోటీసులు పంపించారు.ఆ నోటీసులలో సజ్జనార్ పలు అంశాలపై వివరణ కోరారు. తనపై ఏడు కేసులు ఉన్నాయని చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని సజ్జనార్ కొట్టిపారేశారు. ఆ ఏడు కేసులు ఏ స్టేషన్లో నమోదయ్యాయి? ఏ సెక్షన్ల కింద బుక్ అయ్యాయి? వాటి పూర్తి వివరాలను రెండు రోజుల్లోగా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ వ్యాఖ్యలు కేవలం తన వ్యక్తిగత గౌరవానికే కాకుండా, సిట్ (SIT) వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు, అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకే ఇటువంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని నోటీసుల్లో అభిప్రాయపడ్డారు.
సజ్జనార్ తన నోటీసులో చాలా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. నిర్ణీత సమయంలోగా వివరణ ఇవ్వని పక్షంలో తదుపరి పరిణామాలు ఇలా ఉంటాయని పేర్కొన్నారు. అసత్య ఆరోపణలు చేసినందుకు సివిల్, క్రిమినల్ పరువు నష్టం కేసులు దాఖలు చేస్తామని హెచ్చరించారు. దర్యాప్తు అధికారులను భయపెట్టేందుకు ప్రయత్నించినందుకు తగిన సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వ్యవహారం వల్ల తలెత్తే అన్ని న్యాయపరమైన పరిణామాలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటుండగా, మరోవైపు దర్యాప్తు చేస్తున్న అధికారిపైనే విపక్ష నేత ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రవీణ్ కుమార్ ఈ నోటీసులకు ఎలాంటి ఆధారాలతో సమాధానం ఇస్తారు? లేదా ఈ వివాదం కోర్టు మెట్లెక్కుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రవీణ్ కుమార్ గతంలో పోలీస్ శాఖలో ఉన్నత స్థాయిలో పనిచేసిన వ్యక్తి కావడం, సజ్జనార్ కూడా అంతే పేరున్న అధికారి కావడంతో, ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ పోరు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది.






